బిజెపి దాడిని ప్రతిఘటించాలి : సిపిఎం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ దేశ పౌరుల సమానత్వం వ్యక్తిత్వ విశ్వాసాలపై బిజెపి దాడిని ప్రతిఘటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ పిలుపు నిచ్చారు. మంగళవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో 18వ సార్వత్రిక ఎన్నికలపై ‘ఎన్నికల ప్రణాళిక కరదీపిక’ను విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పౌరుల సమా నత్వం, వ్యక్తిగత విశ్వాసాలపై, కేంద్రంలో అపద్దరమ్మ ప్రధానిగా ఉన్న బిజెపి నరేంద్ర మోడీ దాడి చేస్తున్నారని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, అడ్డదారిలో ఓట్ల కోసం, మెజార్టీ మతస్తులను రెచ్చగొట్టడం, భయాందోళనకుగురి చేయటం ద్వారా, ఎన్నికల లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ వ్యతిరేక, చట్ట విరుద్ధ మోడీ ప్రసంగాలపై సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్లూ ‘సుమోటో’గా తీసుకొని క్రిమినల్‌ కేసు నమోదు చేసి విచారించాలని కోరారు. జాతీయ సమైక్యత, సమగ్రతలకు ముప్పు తెచ్చే ప్రసంగాలపై, జాతీయ ఎన్నికల కమిషన్‌ కొరడా ఝూలిపించాలని కోరారు. పదేళ్లుగా బిజెపి కేంద్ర ప్రభుత్వం జాతీయ సంస్థలన్నిటిని కార్పొరేట్లకు కారు చౌకగా అమ్మేస్తూ వచ్చారని గుర్తు చేశారు. కార్పొరేట్ల నుంచి క్విట్‌ ప్రోకో విధానం ద్వారా రూ.32 వేల కోట్ల బిజెపి ఎన్నికల బాండ్లు సేకరించిందని, బిజెపి బహిరంగ అవినీతి చట్టబద్ధం చేసే ప్రయత్నాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపిస్తూ అక్షింతలు వేసిన, లెక్కచేయకుండా బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల బాండ్స్‌ పై చట్టం చేస్తామని నిస్సిగ్గుగా ప్రకటించింది అన్నారు. ధరలు అదుపు చేయకుండా, బ్లాక్‌ మార్కెట్ను నివారించకుండా, ప్రజలపై మోయలేని పన్నుల భారాలు వేస్తున్నారని విమర్శించారు. దేశ పౌరుల స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను, హరిస్తున్న బిజెపి విధానాలపై ప్రజలు ప్రతిఘటన ఉద్యమాలలో భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని, టిడిపి, జనసేన కూటమిని, రాష్ట్రాన్ని మద్యం ఆంధ్రగా మార్చీ, హత్యా రాజకీయాలను ప్రోత్స హిస్తున్న, నిరంకుశ వైసిపిని18వ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిం చాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25న కడప ప్రెస్‌ క్లబ్‌లో ‘ఓటర్ల ప్రజా చైతన్యం’పై సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. సదస్సుకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.ఃగఫూర్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ, పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసి రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. కడప జిల్లాలోని పార్లమెంటుకు, అసెంబ్లీ సెగ్మెంట్లకు పోటీ చేస్తున్న ‘ఇండియా కూటమి’లోని కాంగ్రెస్‌, సిపిఐ, అభ్యర్థులు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి సిపిఎం నాయకత్వం హాజరవుతారని తెలిపారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్‌, ఏ.రామ్మోహన్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాసు రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, సిపిఎం నగర కమిటీ సభ్యులు ఎస్‌.రాజేంద్ర పాల్గొన్నారు.

➡️