చిత్రకళా పోటీలతో సృజనాత్మకత

May 19,2024 23:30 #summer camps in library
summer camps in library

 ప్రజాశక్తి -ములగాడ : చిత్ర కళా పోటీల్లో పాల్గొనడం ద్వారా సృజనాత్మకత వెల్లివిరుస్తుందని, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి ఇపిఎస్‌.భాగ్యలక్ష్మి అన్నారు. మల్కాపురంలోని ప్రకాష్‌నగర్‌ శాఖా గ్రంథాలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో ఆదివారం ఆమె పాల్గొని మాట్లాడారు. చిత్రకళకు 64 కళల్లో అత్యున్నత స్థానం ఉందని, చిత్రాన్ని ఆవిష్కరించడంలో గల నేర్పు, రంగుల కలయిక చిత్రకారుని ప్రతిభను, కళా దృష్టిని తెలియజేస్తాయని చెప్పారు. చిన్నతనం నుంచి విద్యార్థులకు చిత్రకళలో మెళకువలు, పాఠశాలల్లో, వివిధ శిక్షణ శిబిరాల్లో నేర్పాలని అన్నారు. రాజా రవి వర్మ, వడ్డాది పాపయ్య, అంట్యాకుల పైడిరాజు వంటి ప్రముఖ చిత్రకారులను గురించి చిన్నారులు తెలుసుకోవాలన్నారు. అనంతరం ”గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు” అనే అంశంపై సీనియర్‌ విద్యార్థులకు, ”అందమైన ప్రకృతి దృశ్యం” అనే అంశంపై జూనియర్‌ విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. పోటీలలో 20 మంది పాల్గొన్నారు. కె.సత్తిరాజు, గ్రంథాలయాధికారి వి.అజరుకుమార్‌, సిద్ధార్థ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం విద్యార్థులు వివిధ రకాల కథలను పఠించారు.

➡️