చేరిక సమావేశంలో డాక్టర్‌ అమూల్య భావోద్వేగం

Apr 28,2024 21:45

మాట్లాడుతున్న డాక్టర్‌ అమూల్య
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
గత ఎన్నికల్లో ఓడిపోయిన తన తండ్రికి రాజకీయాలొద్దని తాను చెప్పానని, అయినా ఆయన ప్రజలను విడువకుండా ఐదేళ్లపాటు ప్రజల తరుపునే పోరాడారని ఎన్‌డిఎ కూటమి తరుపున నరసరావుపేట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు కుమార్తె డాక్టర్‌ అమూల్య అన్నారు. తన గురించి, తన తమ్ముడు భవిష్యత్‌ గురించి పట్టించుకోకుండా ఆర్థికంగానూ నాన్న నష్టపోయారని భావోద్వేగానికి గురయ్యారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని రామిరెడ్డిపేట 22వ వార్డులో ఆమె ఆదివారం పర్యటించారు. వార్డులో 100 ముస్లిమ్‌ కుటుంబాలు టిడిపిలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో వార్డుకు చెందిన వైసిపి నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా మహిళలు పలువురు ఏకమై వచ్చి డాక్టర్‌ అమూల్య ఆధ్వర్యంలో టిడిపి కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అమూల్య మాట్లాడుతూ తన తండ్రిపై గెలవడానికి ఓట్లను కాకుండా అడ్డదారులను వైసిపి నాయకులు ఎంచుకోవడం బాధాకరమన్నారు. ఈ ఐదేళ్లపాటు జనం కోసం తన తండ్రి పడిన కష్టం ప్రజలందరికీ తెలుసని, ఆయన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

➡️