ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పేరుతో కొల్లేరు ప్రజల పొట్టకొట్టొద్దు

Nov 18,2023 14:24 #Eluru district

ప్రజాశక్తి – ఉంగుటూరు :  కొల్లేరు ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఐదో కాంటూరు పరిధి దాటి పది కిలోమీటర్ల వరకూ పర్యావరణం పేరుతో 26 నిబంధనలను పెట్టి వేలాదిమంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని కైకరం, తల్లాపురం గ్రామాలను వారు సందర్శించారు. తల్లాపురంలో సర్పంచి పసుపులేటి నరసింహారావుతో పాటు గ్రామ రైతులు పాల్గొన్న సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు, రైతు సంఘం నేత గుత్తికొండ వెంకటకృష్ణారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ కొర్ని అప్పారావు తదితరులు మాట్లాడారు. 2006లో కొల్లేరు ఆపరేషన్‌ పేరుతో జిరాయితీ, సొసైటీ చెరువులను నాడు ధ్వంసం చేసి కొల్లేరు ప్రజలను అనాధలను చేశారని, నేడు మళ్లీ పర్యావరణ సున్నిత ప్రదేశం పేరుతో ఐదో కాంటూరు పైన ఉన్న 89 గ్రామాల ప్రజల కొంప కొల్లేరు చేసే ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. పార్టీలకతీతంగా అన్ని గ్రామాల ప్రజలు ఐక్యమై ప్రతిఘటించాలని అలాగే అన్ని గ్రామాల్లో ఉన్న పంచాయతీలు తీర్మానాలు చేసి తమ వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేయాలని, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఎకో సెన్సిటివ్‌ జోన్‌కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం ప్రజల కంటే పక్షులకే ఎక్కువ ప్రాధాన్యతివ్వడం దుర్మార్గమన్నారు. ప్రజలకు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, కేంద్ర ప్రభుత్వం వారు వాస్తవ విషయాలను చెప్పి ప్రజాభిప్రాయం సేకరించడం బదులు కేవలం మండల కేంద్రాల్లో కొద్దిమందితో అభిప్రాయ సేకరణ జరిపి ప్రజలకు వ్యతిరేకమైన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు.

➡️