‘దొర’తనమా?.. సంధ్యా’రాణి వాసమా’

May 14,2024 22:20

ప్రజాశక్తి – సాలూరు : ఎన్నికల పోలింగ్‌ ముగియ డంతో గెలుపు ఓటములపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. సోమవారం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ప్రశాంతంగా పూర్తయింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి 76.45శాతం పోలింగ్‌ జరిగింది. నియోజకవర్గంలో మొత్తం 2,04,489 ఓట్లుకు గాను లక్షా 56వేల 331 ఓట్లు పోలయ్యాయి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజన్నదొర ఐదోసారి పోటీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు ప్రచార అస్త్రాలుగా రాజన్నదొర బరిలోకి దిగారు. ఆయన ప్రత్యేకంగా హామీ లేవీ ఇవ్వలేదు. వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివద్ధి సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటూ జనంలోకి వెళ్లారు. అయితే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజన్నదొరపై నియోజకవర్గ ప్రజల్లో కొంత అసంతప్తి కూడా ఉంది. అయితే ఆ అసంతృప్తి ఆయన విజయావకాశాలను ప్రభావితం చేసే స్థితిలో లేకపోవడం అనుకూల పరిణామంగా ఉంది. నాలుగు మండలాల్లో, మున్సిపాలిటీకి చెందిన పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఆయన గెలుపు కోసం చేసిన ప్రయత్నంపై ప్రభావం చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మక్కువ, పాచి పెంట, మెంటాడ, సాలూరు మండలాల్లో వైసిపికి ఆధిక్యత వస్తుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో మాత్రమే టిడిపికి ఆధిక్యత వస్తుందనే ప్రచారం జరుగుతోంది. భారీ ఆధిక్యం వస్తుందని టిడిపి నాయకులు కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. పట్టణంలో టిడిపికి 6వేల ఆధిక్యత లభించినా వైసిపి గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే సంధ్యారాణిపై కొంతమంది టిడిపి నాయకుల్లో ఉన్న అసంతృప్తి ఆయన గెలుపు అవకాశాలను దెబ్బ తీస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా సంధ్యారాణి పార్టీలో ఉన్న అసమ్మతి నాయకులను కలుపుకు పోయే ప్రయత్నం చేయకపోవడం కూడా ఆమెకు ప్రతికూల ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలుగు మండలాల్లోనూ సంధ్యారాణిని వ్యతిరేకించే నాయకులు ఆమె గెలుపు కోసం ఏమేరకు పని చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మక్కువ మండల సీనియర్‌ నాయకులు పెంట తిరుపతిరావును కలుపుకు పోవాలని టిడిపి అధిష్టానం ఆదేశించినా సంధ్యారాణి ఆదిశగా ప్రయత్నం చేయలేదు. ఏజెన్సీ గ్రామాల్లో వైసిపికి ఆధిక్యత లభిస్తుండడం ఆ పార్టీ విజయానికి దోహదపడుతుందని అధికారపార్టీ నాయకులు భావిస్తున్నారు. ఐదోసారి ఎమ్మెల్యేగా రాజన్నదొర గెలుపు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

➡️