చెల్లుబాటుపై సందేహాలు!

May 24,2024 23:03

ఈనెల 7వ తేదీన గుంటూలో పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేందుకు నిరీక్షిస్తున్న ఉద్యోగులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్లు పోలవ్వడంతో ఈ ప్రభావం ఫలితాలపై ఎంత వరకు ఉంటుందనే అంశంపై రాజకీయ పక్షాల్లో చర్చ జరుగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్ల కొనుగోలుకూ టిడిపి, వైసిపి పోటాపోటీగా పనిచేశాయి. మంగళగిరికి చెందిన ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌కు రూ.5 వేలు తీసుకుని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయ్యారు. అయితే పోలయిన పోస్టల్‌ బ్యాలెట్లు అని అర్హత కలిగినవేనా? ఎన్ని ఓట్లు చెల్లుతాయి? ఎన్ని ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతాయి అనేఅంశంపై ఉద్యోగ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఉద్యోగులు చేసిన చిన్నపొరపాటు వల్ల గుంటూరు లోక్‌సభ పరిధిలో 10 వేల ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. దీని వల్ల ఫలితాలు తారుమారయ్యాయి. పోస్టల్‌ ఓట్లు తనకే ఎక్కువగా అనుకూలంగా పడ్డాయని, కానీ 10 వేల ఓట్లు చెల్లుబాటు కాకుండా పోవడం వల్ల తాను ఓడిపోయా యని వైసిపి లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి వాపోయారు. ఈ అంశంపై ఆయన హైకోర్టును ఆశ్రయించినా విచారణకు ఐదేళ్లు పట్టింది. కానీ ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు. ఆయనపై పోటీ చేసిన టిడిపి అభ్యర్థి గల్లా జయదేవ్‌ 4800 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం మోదుగులను బాగా కుంగదీసింది. ఈ నేపథ్యంలో ఈసారి పోస్టల్‌ ఓట్లపై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. జిల్లాలో 23,500 ఓట్ల పోస్టల్‌ ఓట్లుపోలవ్వగా సర్వీసు ఓటర్లుకు సంబంధించి మరో 1500 ఓట్ల వరకు వచ్చాయి. జూన్‌ 3 వరకు ఆన్‌లైన్‌లో ఓటు వేసి పోస్టు ద్వారా బ్యాలెట్‌ పంపే రక్షణ శాఖ ఉద్యోగులకు అవకాశం ఉంది. గుంటూరు పార్లమెంటు పరిధిలో 25 వేలు, నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో మరో 25 వేల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ను జూన్‌ 4న లెక్కించాల్సి ఉంది. అయితే ఉద్యోగులు, అధికారులు కూడా తమ బ్యాలెట్‌లను సక్రమంగా బాక్సులో వేయకపోతే ఇన్‌వాలిడ్‌గా పరిగణిస్తారు. ప్రధానంగా డిక్లరేషన్‌ ఫారంపై గెజిటెడ్‌ అధికారి సంతకం తప్పనిసరి. అంతేగాక ఆయన హోదాతో కూడిన స్టాంపు వేయాలి. లేదా ఆయన స్వయంగా పేరు హోదా రాయాలి. కేవలం సంతకం చేస్తే ఓటు చెల్లదు. డిక్లరేషన్‌ నంబరు మెయిన్‌ కవర్‌పైనా, బ్యాలెట్‌ పైన నెంబరు పోస్టల్‌ బ్యాలెట్‌ ఉంచే కవర్‌పైన నమోదు చేయాలి. వీటిలోఏది పొరపాటు చేసినా ఓటు చెల్లదు. గత ఎన్నికల్లో కవర్‌పై సంతకం లేకపోవడం వల్ల ఎక్కువ ఓట్లు చెల్లకుండాపోయాయి. ఈసారి కవర్‌ పై సంబంధిత ఉద్యోగి, అధికారి సంతకంకు మినహాయింపు ఇచ్చారు. ఉద్యోగులు, అధికారులే డిక్లరేషన్‌ ఫారాలను రెండు వేర్వేరు కవర్లలో పెట్టి బాక్సులో వేయాలి. పార్లమెంటుకు, అసెంబ్లీకి వేర్వేరుగా రెండు డిక్లరేషన్‌లను పొరపాటుగా వేసినా అనర్హతగా నిర్ధారిస్తారు. తాజాగా గెజిటెడ్‌ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, హోదాతోకూడిన స్టాంపు లేకున్నా అనుమతించాలని టిడిపితో పాటుపలువురు ఉద్యోగ సంఘాలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈ అంశంపై ఇంకా ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకోలేదు. 4వ తేదీన ఓట్ల లెక్కింపు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌లతోనే ప్రారంభిస్తారు. మొత్తం 14 టేబుల్స్‌ ఏర్పాటు చేసి టేబుల్‌కు 500 ఓట్ల చొప్పున 4 రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌కు ఏడు వేలు చొప్పున లెక్కించే అవకాశం ఉంది. అయితే పోలయిన ఓట్లలో చెల్లినవి, చెల్లుబాటు కానివి ముందుగా విభజించి ఆ తరువాత లెక్కింపు ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

➡️