తాగునీటి సమస్యలేకుండా చూడాలి

Apr 26,2024 20:44

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : వేసవిలో తాగునీటి కోసం ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా చూడాలని వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ అధికారులను కోరారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ ఫణీంద్ర కుమార్‌ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి తాగునీటి కోసం ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులకు సూచించారు. కురుకుట్టి ఎంపిటిసి గెమ్మెల సుబ్బారావు మాట్లాడుతూ తమ పంచాయతీలోని జాకరవలసకు గత రెండేళ్లుగా మోటార్లు పనిచేయక తాగునీరు లేక ప్రజలు సువర్ణముఖి నది నుంచి నీరు తెచ్చుకొని తాగుతున్నారని, కలుషితమైన ఈ నీరుతాగి రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని, ఇకనైనా ఆ గ్రామానికి మోటార్లు బాగు చేసి తక్షణమే తాగునీరు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనికి ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ గౌస్‌ మొహిద్దీన్‌ మాట్లాడుతూ ఈ పంచాయతీకి రూ.72 లక్షలు మంచి నీటి కోసం మంజూరై ఉన్నాయని, ఎన్నికల నేపథ్యంలో వాటిని ఉపయోగించడానికి వీలు లేకుండా ఉందని తెలిపారు. ఈ విషయంపై కల్పించుకున్న ఎంపిడిఒ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అక్కడ పనులు మందగించినా తక్షణమే వాటర్‌ ట్యాంకులతో నీటిని గ్రామాలకు సప్లై చేయాలని సూచించారు. ఎపిఒ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనిని చేయిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై నార్లవలస ఎంపిటిసి అనూష మాట్లాడుతూ నార్లవలస పంచాయతీకి సంబంధించి ఉపాధి పనులు చేయడంలేదన్నారు. దీనికి ఎపిఒ సమాధానమిస్తూ కొన్ని గ్రామాల్లో కూలీలు అందుబాటులో లేరని, బయట పనులకు వెళ్లిపోయారని తక్షణమే ఎవరు ఉన్నా వారికి పని కల్పిస్తామని తెలిపారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో టెంట్లు, మంచి నీరు, మజ్జిగ అందుబాటులో ఉండాలని, 60ఏళ్లు దాటిన వారికి పనులకు పెట్టుకో వద్దని వైస్‌ ఎంపిపి అన్నారు. తోణాం పిహెచ్‌సి వైద్యులు అనిల్‌ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో ప్రతి గ్రామంలో ఫ్యాగింగ్‌ చేయించాలని, ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయని, దీనికోసం స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు తక్షణమే కల్పించుకొని ఆ గ్రామాల్లో ఫాగింగ్‌ నిర్వహించి పారిశుధ్య పనులు కూడా చేయిస్తామని ఎంపిడిఒ తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి జి.రాములమ్మ, పలువురు అధికారులు, సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.అధికారుల గైర్హాజరుతో సాదాసీదాగా ముగిసిన మండల సమావేశం సీతానగరం : అధికారుల గైర్హాజరుతో మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి బి.రమణమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అధికారులు హాజరుకాకపోవడంతో ఎటువంటి అంశాలను చర్చించకుండానే సమావేశాన్ని ముగించారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ జి.ఈశ్వరరావు, జడ్పిటిసి ఎం.బాబ్జీ, వైస్‌ ఎంపిపి టి.సూర్యనారాయణ, పలువురు ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.

➡️