ఇళ్ల పట్టాలను ఎంఎల్‌ఎ అమ్ముకున్నారంటూ ధర్నా

Feb 8,2024 23:42
బిక్కవోలు

ప్రజాశక్తి – బిక్కవోలు
బిక్కవోలు మండలంలో స్థానిక వైసిపి నాయకుల సహకారంతో అనర్హులకు ఇళ్ల పట్టాలను ఎంఎల్‌ఎ అమ్ముకున్నారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. బిక్కవోలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అర్హులందరికీ ఇళ్ల పట్టాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించారు. తొలుత బిక్కవోలులో టిడిపి కార్యాలయం నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పాదయాత్ర చేపట్టారు. ధర్నా అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో కార్యాలయం ఇన్‌ఛార్జికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీలో పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. బిక్కవోలులో 180 మంది, బలభద్రపురం గ్రామంలో 140 మందిని ఏ కారణం లేకుండా అనర్హల జాబితాలో చేర్చారన్నారు. బిక్కవోలు గ్రామంలో 1,100 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు. వీరంతా స్థానికేతరులు, అనర్హులు అని అన్నారు. వీరి నుంచి రూ.13 కోట్ల వరకూ వసూలు చేశారన్నారు. దీనిపై విజిలెన్స్‌ విచారణ నిర్వహించాలన్నారు. గత తహశీల్దార్‌ రాత్రికి రాత్రికి గుట్టు చప్పుడు కాకుండా 120 పట్టాలు పంపిణీ చేసి బదిలీపై వెళ్లిపోయారన్నారు. టిడిపి అధికారంలోకొచ్చిన తర్వాత లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌ఛార్జి చిట్టిబాబుచౌదరి, తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి త్రిమూర్తులు, టిడిపి బిసి సెల్‌ మండల అధ్యక్షులు రామచంద్రరావు, మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యానిర్వాహక కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి సుబ్బారెడ్డి, నాయకులు రామారావు, రమేష్‌, సిద్దు, మధు తదితరులు పాల్గొన్నారు.

➡️