ఎన్నికల నియమావళిపై శిక్షణ

Feb 29,2024 22:23
కలెక్టరేట్‌

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌
స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎంసిసి బృందాలు, ఎఇఆర్‌ఒలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌, వ్యయ పరిశీలకులు, పోలీసు అధికారులు, ముఖ్య సిబ్బందికి మాస్టర్‌ ట్రైనర్ల ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల నియమావళిపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెసి తేజ్‌ భరత్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకూ తావులేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును పూర్తి పారదర్శకంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ క్రమంలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే ఎన్నికల ఖర్చుల నియంత్రణ పరిశీలకుల బృందాలు పూర్తిస్థాయిలో సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. డబ్బు వినియోగంపై దృష్టి పెట్టాలని కోరారు. ఎన్నికల్లో మితిమీరిన, అక్రమ ఖర్చులే అవినీతికి మూలకారణని పేర్కొన్నారు. నగదును తీసుకెళ్లడం చట్టం ప్రకారం చట్టవిరుద్ధం కాదు కానీ భారీ నగదు లావాదేవీలు అనుమానాన్ని సృష్టిస్తాయన్నారు. ఎన్నికల సమయంలో భౌతికంగా, ఎటువంటి నగదు లావాదేవీలూ వాటి విషయంలో సహేతుకమైన పత్రాలు దగ్గర ఉంచుకోవాని పేర్కొన్నారు. అటువంటి సమయంలో సహేతుకమైన కారణం బహిర్గతం చెయ్యకపోతే, ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకోవచ్చునని తెలిపారు. చట్టపరమైన నిబంధనలు, ఆదాయపు పన్ను చట్టాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. కోడ్‌ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి సిబ్బంది అంతా భారత ఎన్నికల సంఘం ఆధీనంలోనే పని చేస్తారని చెప్పారు. కమిషన్‌ ఇచ్చిన నిబంధనల మేరకు పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఏమైనా సందేహాలు తలెత్తితే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణలో మాస్టర్‌ ట్రైనర్లు సిహెచ్‌. భరద్వాజ శ్రీనివాస్‌, ఎ.నాగేశ్వర రావు, ఎ.ఉషశ్రీ, రుడా ప్రాజెక్ట్‌ అధికారి జి.కోటయ్య పాల్గొన్నారు.

➡️