దళిత సింహ గర్జనకు తరలిరావాలి: హర్షకుమార్‌

Feb 10,2024 22:26
రాజమహేంద్రవరంలో

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరంలో ఆదివారం నిర్వహిస్తున్న దళిత సింహ గర్జనకు వేలాదిగా తరలిరావాలని మాజీ ఎంపి జివి.హర్షకుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం కడియం మండలం వేమగిరిలోని సభా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. దళితుల ఆవేదనను, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే దళిత సింహ గర్జన సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దళితులు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను, అణిచివేతను ఎవరో ఒకరు గొంతు విప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. అమలాపురం పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి తనకు 2 దఫాలు ఎంపీగా గెలిపించిన దళితులకు ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దళితులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను కడతేర్చడానికే తన ఉద్యమం సాగుతుందన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు కేటాయించవలసిన మెడికల్‌ సీట్లను సైతం అమ్ము కున్నారని అన్నారు. దళితుల అభివీద్ధి కోసం ఖర్చు చేయవలసిన నిధులను, 27 సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కి, ఇతర పథకాలకు మళ్ళించారని విమర్శంచారు. ఈ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా దళితులు చాలా ఇబ్బం దులకు గురయ్యారని, పెత్తందారీ వ్యవస్థ అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గానికి ఒక మంత్రి పదవి కేటాయించినప్పటికీ కూడా సంక్షేమ ఫలాలు అందడం లేదని, దళితులకు గౌరవం దగ్గర లేదని అన్నారు. దళితుల పడుతున్న కష్టాలు, ఇబ్బందులు ఈ దళిత సింహ గర్జన సభ ద్వారా ప్రపంచానికి చాటనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం సురేష్‌, శెట్టి రాజు, సైరా భాను, ఎల్‌వి.ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️