రూరల్‌ వైసిపిలో రూలర్‌ ఎవరో..

Jan 23,2024 23:11
రూరల్‌ వైసిపిలో రూలర్‌ ఎవరో..

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఎపి గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ ఛైర్మన్‌ చందన నాగేశ్వర్‌ దారెటు అనే ప్రశ్న కేడర్‌లో తలెత్తుతోంది. గత మూడేళ్లుగా వైసిపి రూరల్‌ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలను నిర్వర్తించిన చందన నాగేశ్వర్‌ గత కొన్ని రోజులుగా తటస్థంగా ఉన్నారు. ఈ పరిస్థితికి పార్టీ అధినేత నిర్ణయమే కారణమని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి ఎంఎల్‌లకు స్థానచలనాలకు తెరలేపింది. ఈ నేపథ్యంలోనే రామచంద్రాపురం ఎంఎల్‌ఎ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు రూరల్‌ నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పింది. డిసెంబరు మొదటి వారం నుంచే సంకేతాలు ఇచ్చి నెలాఖరు నాటికి పూర్తి స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్న చందన నాగేశ్వర్‌కు భంగపాటు తప్పలేదు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసిపి విజయఢంకా మోగించినప్పటికీ రాజమండ్రి అసెంబ్లీ, రూరల్‌ నియోజక వర్గాల్లో ఎదురుగాలి తప్పలేదు. వైసిపి అభ్యర్థి ఆకుల వీర్రాజుపై సుమారు 11 వేల ఓట్లు తేడాతో టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. ఈ నేపథ్యంలో రూరల్‌ నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎగా పోటీ చేసేందుకు చందన ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ మేరకు గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ పర్యటించారు. గోదావరి వరదల సమయంలో సేవా కార్యక్రమాలు సైతం చేపట్టారు. అయితే వైసిపి అధిష్టానం అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. తొలుత ఎంపీ భరత్‌ రామ్‌ శిబిరంలో ఉన్న చందన నాగేశ్వర్‌ కొంతకాలానికే అదేపార్టీలో మరో వర్గమైన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజాకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే భరత్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. మరోవైపు జక్కంపూడి రాజా నుంచి కూడా ఎటువంటి భరోసా లేకపోవటంతో తటస్థంగా మిగిలిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి వేణుగోపాల కృష్ణ గుడ్‌ మార్నింగ్‌ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత రెండ్రోజులుగా నియోజకవర్గంలో పర్యటనలను ప్రారంభించారు. మరో 3 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆ పార్టీలో సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. మరోవైపు జనవరి ఒకటో తేదీన మాజీ ఎంఎల్‌ఎ చందన రమేష్‌తో పాటు మాజీ ఎంపి హర్షకుమార్‌ను కలిసిన విషయం విదితమే. ఈ కలయిక యాథృచ్ఛికమే అని చెప్పనప్పటికీ కేడరల్‌లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కడియంలో కాక రేపుతున్న వేణుకడియం : జిల్లాలో తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న పూర్వపు కడియం నియోజకవర్గం (ప్రస్తుత రాజమహేంద్రవరం రూరల్‌)లో పట్టు కోసం వైసిపి తీవ్రంగా శ్రమిస్తోంది. గత రెండు పర్యాయాలు బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వివాదరహితుడు, మదుస్వభావి ఆకుల వీర్రాజును అభ్యర్థిగా నిలిపినప్పటికీ ఓటమి తప్ప లేదు. దీంతో వైసిపి అధిష్టానం సుదీర్ఘంగా ఆలోచించి ఎంపీ భరత్‌ సూచన మేరకు మాజీ ఎంఎల్‌ఎ తనయుడు, నియోజకవర్గంలో బలమైన బిసి వర్గానికి చెందిన చందన నాగేశ్వర్‌ను రూరల్‌ కో ఆర్డినేట్‌ గా నియమించింది. గత మూడు సంవత్సరాలుగా కో ఆర్డినేటర్‌గా ఉన్న చందన నియోజకవర్గంలో ఏమాత్రం పట్టు సాధించలేకపోయారని అంటున్నారు. నియోజకవర్గంలో ఏ అధికారిక కార్యక్రమం చేపట్టినా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలసి మమ అనిపించేవారని, ఆయన ప్రవర్తన, వ్యవహారశైలి ఆయా గ్రామాల్లో కరుడుగట్టిన వైసిపి కార్యకర్తలతో పాటు, చిన్నా చితకా నాయకులకు సైతం మింగుడు పడలేదని అంటున్నారు. ఇదే ఆయనకు శాపంగా మారిందనడం అతిశయోక్తి కాదు. దీంతో ప్రత్యామ్నాయం కోసం అధిష్టానం అనేక తర్జనభర్జనల నడుమ మంత్రి చెల్లబోయిన వేణును రూరల్‌ కో ఆర్డినేటర్‌గా నియమించింది. ఆయన వచ్చీ రావడంతోనే అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. మరోపక్క గ్రామ గ్రామానా ఉన్న కరుడుగట్టిన కార్యకర్తలకు ఫోన్లు, నాయకులకు రాయబారాలతో పాటు స్వయంగా తానే వారి, వారి ఇళ్లకువెళ్లి కలుస్తూ మంత్రి తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ… అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రూరల్‌ వైసిపి కో ఆర్డినేటర్‌ ఎవరైనా వారిపై అలక బూనడం, వారిని ఎన్నికల్లో ఓడించడం పనిగా పెట్టుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు కడియం మండలానికి చెందిన కొందరు వైసిపి నాయకులు. వీరు వేణును వదులుతారా.. వేణు వీరిని వదిలించుకుంటారా.. లేక వారిని గాడిలో పెడతారా.. అనేది రాబోవు రోజుల్లో వేచి చూడాలి అంటున్నారు ప్రజలు.

➡️