వైద్యులు నైపుణ్యాలను పెంచుకోవాలి

Mar 17,2024 22:32
వైద్యులు నైపుణ్యాలను పెంచుకోవాలి

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఆర్థోపెడిక్‌ వైద్యులంతా ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవాలని పలువురు ఆర్థోపెడిక్‌ వైద్య నిపుణులు పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్యాపురంలోనిసాయి హాస్పిటల్స్‌ కాన్ఫరెన్స్‌ హాలులో రాజమండ్రి ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గోదావరి ఆర్థోప్లాస్టీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎముకలు, కీళ్ల వైద్యంలో వస్తున్న వివిధ మార్పులు, వాటికి అనుగుణంగా అనుసరించాల్సిన వైద్య విధానాలపై జాతీయ స్థాయిలోని ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్య నిపుణులు దిశానిర్ధేశం చేశారు. కోయంబత్తూరుకు చెందిన గంగా హాస్పిటల్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ ధనశేఖర్‌ రాజా సదస్సులో మాట్లాడుతూ తాను అందించిన వైద్య సేవలు, చేసిన సర్జరీల్లో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను వివరించారు. కొన్నిసార్లు సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినపుడు ఎలా అధిగమించాలో ఆర్థోపెడిక్‌ సర్జన్లకు వివరించారు. వెలిస్‌ రోబోతో మోకాలు మార్పిడి ఆపరేషన్‌ చేసి, కాన్ఫరెన్స్‌ హాల్లోని ఆర్థోపెడిక్‌ సర్జన్లకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించారు. సర్జరీని ప్రత్యక్షప్రసారంలో చూస్తున్నపుడు, ధనశేఖర్‌ రాజాతో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి కొంత మంది ఆర్థోపెడిక్‌ సర్జన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మోకాలు మార్పిడి సర్జరీలో మోకీళ్లను జాగ్రత్తలను డాక్టర్‌ ఆదిత్య కృష్ణ వివరించారు. గోదావరి జిల్లాల్లో ప్రముఖ తొలి రోబోటిక్‌ మోకాలు మార్పిడి సర్జన్‌ డాక్టర్‌ విజయకుమార్‌ మోకాలు మార్పిడి సర్జరీలో అనుసరించాల్సిన ప్రాథమిక అంశాలను వివరించారు. తుంటి మార్పిడి సర్జరీని కూడా సదస్సులో ప్రత్యక్ష ప్రసారం చేసారు. డాక్టర్‌ జె వి శ్రీనివాస్‌ ఈ సర్జరీ నిర్వహించారు. తుంటి మార్పిడికి ఇంప్లాంట్‌ ఎలా ఎంపిక చేసుకోవాలో డాక్టర్‌ నాగేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో సదస్సు ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సాయి హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ కె.విజయకుమార్‌, డాక్టర్‌ రత్నాకరరావు, డాక్టర్‌ ఆనంద్‌ చౌదరి, డాక్టర్‌ విఠల్‌ కుమార్‌, విఠల్‌ బాబు, డాక్టర్‌ కె.రఘు, డాక్టర్‌ ఎ.రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️