ఇవిఎంల భద్రతపై కలెక్టర్‌, ఎస్‌పి సమీక్ష

May 16,2024 21:59
ఇవిఎంల భద్రతపై కలెక్టర్‌, ఎస్‌పి సమీక్ష

ప్రజాశక్తి-రాజానగరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో జిల్లాలో ఏడు శాసనసభ, రాజమండ్రీ పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్స్‌, వివి ప్యాట్స్‌ భద్రతపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, జిల్లా ఎస్‌పి జగదీష్‌ గురువారం పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రత, కౌంటింగ్‌ ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. దీనిపై కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ జూన్‌ 4వ తేదీన పోలింగ్‌ ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించి నివేదికలను అందించాలని ఆదేశించారు. పోలైన ఇవిఎంలను భద్రపరిచే క్రమంలో కేటగిరీ ఎ, బి యూనిట్స్‌, కేటగిరీ సి, డిలకు చెందిన యూనిట్స్‌ భద్రతపై ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిందన్నారు. మూడు షిఫ్టుల్లో స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద బందోబస్తు, గెజిటెడ్‌ అధికారుల పర్యవేక్షణ, సిసి కెమేరాల నిరంతర నిఘా ఉండాలన్నారు. ఎస్‌పి పి.జగదీష్‌ మాట్లాడుతూ యూనివర్సిటీలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. డిఎస్‌పి, సిఐ, మొబైల్‌ టీమ్‌, సిఆర్‌పిఎఫ్‌, ఎఆర్‌ ఫోర్సెస్‌, రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద కౌంటర్‌ పూర్తయిన వరకు 144 సెక్షన్‌ ఉంటుందని చెప్పారు. దీనిలో రిటర్నింగ్‌ అధికారులు రాజమండ్రి రూరల్‌ జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, రాజమండ్రీ సిటీ మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ్‌, రాజానగరం ఆర్‌ఒ ఎ.చైత్ర వర్షిణి, అనపర్తి ఆర్‌ఒ ఎం.మాధురి, నిడదవోలు ఆర్‌ఒ వి.రమణ నాయక్‌, గోపాలపురం ఆర్‌ఒ ఎల్‌.శివ జ్యోతి, ఎఎస్‌పిలు ఎల్‌.చెంచి రెడ్డి, ఆర్‌.కృష్ణ నాయక్‌, డిఎస్‌పి కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️