పేపరు మిల్లు కార్మికులకు అండగా ఉద్యమం

Apr 5,2024 23:18
పేపరు మిల్లు కార్మికులకు అండగా ఉద్యమం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఎపి పేపర్‌ మిల్లు యాజమాన్యం నిరంకుశ విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు తెలిపారు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రెస్‌ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం పేపర్‌ మిల్‌ వద్ద కార్మిక సంఘాలతో మాట్లాడారు. కార్మికులు 72 గంటలుగా నిరవధిక సమ్మె చేస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోకపోవడం అన్నాయమన్నారు. కార్మికులకు వేతన ఒప్పందం చేయకుండా కోర్టులను సైతం అడ్డు పెట్టుకునే విధానం సరైంది కాదన్నారు. ఇటువంటి దుర్మార్గపు విధానం ఎల్లకాలం సాగదన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌ మాట్లాడుతూ మిల్లులోని కార్మిక సంఘాలు వేతన ఒప్పందం కోసం గత 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. కార్మికుల న్యాయమైన కోర్కెలను శాంతియుతంగా పరిష్కరించాల్సిన యాజమాన్యం కార్మిక సంఘాల గుర్తింపులనే రద్దు చేయాలనే కుట్ర చేసిందని గుర్తు చేశారు. ఫిబ్రవరి 26న సమ్మె నోటీసు ఇచ్చాయని తెలిపారు. కార్మికులు న్యాయబద్ధమైన 23 డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచిందన్నారు. 10 రోజుల తర్వాత చర్చలకు పిలిచిన యాజమాన్యం కార్మికుల డిమాండ్లపై కనీసం స్పందించలేదన్నారు. దీంతో ఈ నెల 2వ తేదీ నుంచి కార్మికులు చట్టబద్ధంగా సమ్మెకు వెళ్లారని చెప్పారు. ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు టి.మధు, ఐఎఫ్‌టియుసి కార్యదర్శి జోజి, ఐఎన్‌టియుసి నాయకులు మాధవ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి.రాజులోవ, ఎస్‌ఎస్‌.మూర్తి, జిల్లా నాయకులు బి.పవన్‌, కె.రాంబాబు పాల్గొన్నారు.

➡️