‘రజకులకు అన్యాయం జరుగుతోంది’

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

రాష్ట్రంలో 25 లక్షల పైచిలుకు ఉన్న రజకులకు రాజకీయంగా, సామాజికంగా తీరని అన్యాయం జరుగుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజక సంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆరోపించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజక కార్యకర్తల సమావేశం ఆదివారం స్థానిక రజక సంఘ భవనంలో జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో రాజకీయ పార్టీలు రజకులకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆక్షేపణ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రజకులకు కేటాయించాల్సిన దోబీఘాట్‌ నిధులకు గండి కొట్టారని, నిధులు కేటాయించపోగా రజకుల వృత్తి విషయంలో ప్రభుత్వ జిఓలను అధికారులు అనుసరించకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రకటించిన సీట్లలో రజకులకు ఎటువంటి ప్రాధాన్యత కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎల్‌సి అభ్యర్థి స్థానాన్ని రజక సామాజివర్గానికి కేటాయించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యత ఇచ్చిన రాజకీయ పార్టీకి రజకులంతా మద్దతు తెలిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలను నిర్వహించి సంసిద్ధం చెయ్యనున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా యూత్‌ ప్రధాన కార్యదర్శి విటాల శ్రీనివాసరావు, జిల్లా జాయింట్‌ సెక్రెటరీ కొమ్మంటి మురళీ, జిల్లా సీనియర్‌ నేతలు జుజ్జువరపు శ్రీనివాసరావు, ఎలమంచిలి నాగ శేషు, పలువురు రజక నేతలు హాజరయ్యారు.

➡️