వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం

సామాజిక కార్యకర్త మండే సుధాకర్‌
ప్రజాశక్తి – భీమడోలు
వినియోగదారులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సామాజిక కార్యకర్త మండే సుధాకర్‌ కోరారు. భీమడోలు శాఖా గ్రంథాలయంలో బుధవారం గ్రంథ పాలకులు కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా నేషనల్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ కమిషన్‌(ఎన్‌సిఆర్‌సి) ఆధ్వర్యంలో వినియోగదారుడా మేలుకో, చట్టం నీకు కల్పించిన హక్కుల గురించి తెలుసుకో అనే అంశంపై అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్‌సిఆర్‌సి జిల్లా ఛైర్మన్‌ మణికంఠ మాట్లాడుతూ వినియోగదారుల భద్రత హక్కు, నష్ట పరిహారం పొందే హక్కు, విన్నవించుకునే హక్కు, సమాచార హక్కు, వినియోగదారుడు విద్యను పొందే హక్కు గురించి వివరించారు. ఎన్‌సిఆర్‌ఆర్‌సి ఏలూరు ఇన్‌ఛార్జి పివివి.సత్యనారాయణ మాట్లాడుతూ, సదస్సులో పాల్గొన్న విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను ఇంట్లోని పెద్దలకు తెలియజేయాలని, వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు. అనంతరం గ్రంథాలయ ఆవరణలో విద్యార్థులు ఎన్‌సిఆర్‌సి కార్యక్రమం గురించి వివరిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ టివి.ఉమామహేశ్వరరావు, మానవత భీమడోలు శాఖ ఛైర్మన్‌ గుళ్ల నూకరాజు పాల్గొన్నారు.

➡️