అమ్మో.. జులై..!

పోలవరం నిర్వాసితుల్లో గోదావరి వరద గుబులు
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల జనం బిక్కుబిక్కు
వరద భీభత్సంతో ప్రతియేటా గ్రామాలన్నీ అతలాకుతలం
తాత్కాలిక చర్యలతో ప్రభుత్వం కాలయాపన
పునరావాస పరిహారం ఇవ్వకుండా, ఇళ్లు కట్టకుండా నిర్లక్ష్యం
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
పోలవరం నిర్వాసితులను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. ప్రతియేటా జులైలో విరుచుకుపడుతున్న గోదావరి వరదలకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. దీంతో ఈ ఏడాది పరిస్థితి ఏ విధంగా ఉంటుందోననే భయం నిర్వాసితులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ప్రాజెక్టు పనులు ముందుకు సాగిస్తున్న ప్రభుత్వాలు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా, ఇళ్లు నిర్మించకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. దీంతో ప్రతియేటా గోదావరి వరదలకు నిర్వాసితులంతా వరద బాధితులుగా మారి నరకం అనుభవిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ప్రతియేటా వరదలు భీభత్సం సృషిస్తున్నా శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయకపోవడం దుర్మార్గంగా చెప్పొచ్చు. ప్రాజెక్టులో కాపర్‌డ్యామ్‌ నిర్మాణం పూర్తవ్వడంతో భద్రాచలం వద్ద 50 అడుగుల ఎత్తుకు వరద నీరు రాకుండానే గ్రామాలన్నీ ముంపుబారిన పడుతున్నాయి. ఈ రెండు మండలాల్లో దాదాపు 107 వరకూ గ్రామాలు ఉండగా వంద గ్రామాల వరకూ వరద నీరు చుట్టుముడుతోంది. గోదావరికి వరద నీరు పోటెత్తడంతోనే కుక్కునూరు మండలంలోని గొమ్ముగూడెం, వేలేరుపాడు మండలంలోని కొయిదా వంటి దాదాపు 20కుపైగా గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తోంది. గోదావరి వరదల ఉధృతితో నిర్వాసిత ప్రజలు కొండలు, గుట్టలపై నెలలు తరబడి కాలం గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఈ రెండు మండలాల్లో దాదాపు 20 వేలకుపైగా కుటుంబాలు ఉన్నాయి. వరదలకు రోడ్ల మార్గాలన్నీ మూసుకుపోయి ఆ గ్రామం, ఈ గ్రామం అనే తేడా లేకుండా ప్రజలంతా వరద బాధితులుగా ఇబ్బందులు పడుతున్నారు. వరదలు వచ్చిన తర్వాత తాగునీరు, నిత్యావసర వస్తువుల కోసం నానావస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కుటుంబానికి రూ.వెయ్యి, నాలుగు రకాల కూరగాయలు అందించి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉంటోంది. వరదలతో పొలాలన్నీ ముంపు బారిన పడటంతో నెలలు తరబడి ఉపాధి లేక, ప్రభుత్వం నుంచి సరైన సాయం అందక అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎంత చెప్పినా తక్కువే. ప్రభుత్వం నిర్వాసితులను తరలించేందుకు మొదటి కాంటూరు, రెండో కాంటూరు అంటూ లెక్కలు పెట్టింది. అయితే గడిచిన రెండేళ్ల్ల వరద పరిస్థితులను గమనిస్తే కాంటూరు లెక్కలన్నీ బూటకమని తేలిపోయింది. ముంపులేని కివ్వాక పునరావాస కాలనీని సైతం వరద నీరు చుట్టుముట్టడమే దీనికి నిదర్శనం. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా గ్రామాలన్నీ ముంపుబారిన పడుతున్నాయి. దీంతో ముంపు బారిన పడిన గ్రామాలను మొదటి కాంటూరులో చేర్చాలని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టినా పట్టించుకున్న దాఖలాల్లేవు. వరదలు వచ్చిన ప్రతిసారీ స్కూళ్లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు నెలలు తరబడి చదువులకు దూరం కావాల్సి వస్తోంది. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో పోలవరం నిర్వాసితుల గురించి ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంది. ప్రభుత్వం మారడంతో ఏ విధంగా ముందుకు సాగుతుందో వేచిచూడాలి.పరిహారం అందించకుండా నిర్లక్ష్యం పునరావాస పరిహారం అందించి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని నిర్వాసితులను గ్రామాల నుంచి ఖాళీ చేయించాల్సి ఉంది. ప్రభుత్వం అటువైపు కనీస ఆలోచన కూడా చేయడం లేదు. గత వైసిపి ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ రూ.పది లక్షలు, 2006కు ముందు సేకరించిన భూములకు రూ.ఐదు లక్షలు ఇస్తామని చెప్పి నిర్వాసితులను మోసగించింది. ఐదేళ్ల పదవీ కాలంలో నిర్వాసితులకు పరిహారం అందించకుండా వదిలేసింది. గ్రామాలను వదిలి బయటికి వస్తే ప్రభుత్వం పరిహారం ఇచ్చే అవకాశం ఉండదని తెలిసి నిర్వాసితులు గ్రామాల్లోనే ఉంటున్నారు. దీంతో వరదలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాసితుల కోసం జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టినా అవి పూర్తి చేయని పరిస్థితి ఉంది. నిర్మాణం పూర్తి చేసినట్లు చెబుతూ నిర్వాసితులను తరలించిన కాలనీల్లోనూ తాగునీరు, రోడ్లు, ఉపాధి వంటి కనీస వసతులు లేకుండాపోయాయి. పునరావాస పరిహారం, యువతకు ప్యాకేజీ, భూమికి భూమి వంటి సమస్యలను పరిష్కరించి నిర్వాసితులను గ్రామాల నుంచి పంపించాల్సి ఉంది. ప్రభుత్వం ఆ పని చేయనంత కాలం పోలవరం నిర్వాసితులు ప్రతియేటా వరద బాధితులుగా కష్టాలు అను భవించాల్సిన దుస్థితి కొనసాగనుంది. కొత్త ప్రభుత్వమైనా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాల్సి ఉంది.

➡️