ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌
ప్రజాశక్తి – ఏలూరు
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని, మతోన్మాద బిజెపి, రాష్ట్రంలో దానికి తొత్తుగా వ్యవహరిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలను ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. సిపిఐ ఏలూరు అసెంబ్లీ ఇండియా కూటమి అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం కార్యకర్తలు బుధవారం ప్రచారం నిర్వహించారు. ప్రచార సభలో ప్రభాకర్‌ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా విస్మరించిందన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేస్తామని, నల్లధనం వెలికితీసి పేదల ఎకౌంట్లో రూ.15 లక్షలు జమ చేస్తామని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విభజన హామీలు ఇస్తామని ఇలా అనేక వాగ్ధానాలు చేసిందన్నారు. కాని బిజెపి ఈ పదేళ్లల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. అంతేకాకుండా ఈ పదేళ్లలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ కరెంటు ఛార్జీలను పెంచిందని విమర్శించారు. కార్మికులకు వర్తించే చట్టాలను తీసేసి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చిందన్నారు. దేశంలో మణిపూర్‌, కర్ణాటక, ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాల్లో ముస్లింలు, క్రైస్తవులపై దౌర్జన్యాలు చేయించిందన్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ సిఎఎ చట్టాన్ని తీసుకొచ్చి మత ప్రాతిపదికన ప్రజలను విడగొట్టాలని చూస్తుందని విమర్శించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, సిపిఎం జిల్లా నాయకులు బి.సోమయ్య, నగర కార్యదర్శి పి.కిషోర్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.కన్నబాబు, ఉండేటి బేబి, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మన్నవ యామిని, ఉపాధ్యక్షురాలు మావూరి విజయ, గొర్లి స్వాతి, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ డాంగే పాల్గొన్నారు.

➡️