సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్దం

May 12,2024 17:35

ఈవిఎం బాక్సులతో సిబ్బంది
ప్రజాశక్తి-తెనాలి :
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రిటర్నింగ్‌ అధికారి ప్రఖర్‌ జైన్‌ నేతృత్వంలో పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. స్థానిక జెఎంజె మహిళా కళాశాల్లో ఎన్నికల సిబ్బందికి మెటీరియల్‌, ఈవిఎంల పంపిణీ జరిగింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌కు చేరుకోవటం కనిపించింది. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, అదర్‌ పోలింగ్‌ ఆపీసర్స్‌తో కూడిన ఆరుగురు బృందాన్ని అధికారులు కేటాయించారు. డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌ వద్ద పెద్దపెద్ద టెంట్లు ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రతకు ఇబ్బంది లేకుండా కూలర్లు ఏర్పాటు చేశారు. త్రాగునీరు, మొబైల్‌ టాయిలెట్స్‌ అందుబాటులో ఉంచారు. ఎన్నికల సిబ్బందికి ఉదయం టిఫిన్‌తో పాటు మద్యాహ్నం భోజన సౌకర్యాన్ని కూడా కల్పించారు. నియోజకవర్గంలో ఉన్న తెనాలి, కొల్లిపర మండలాలకు సంబందించి 273 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు అందుకు తగిన రీతిలో సిబ్బందిని కేటాయించి, వారిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు ఆర్టీసి బస్సులతో పాటు, ప్రైవేటు వాహనాలను ఉపయోగించారు.

పోలింగ్‌ సిబ్బందికి, ఓటర్లకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాం
-ప్రఖర్‌జైన్‌, రిటర్నింగ్‌ అధికారి, తెనాలి
నియోజకవర్గంలో మొత్తం 273 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వాటిలో 40 సమస్యాత్మకంగా గురించాం.అక్కడ ప్రత్యేక భధ్రత కల్పించాం. 208 పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశాం. పోలింగ్‌ స్టేషన్‌కు బయట, లోపల కూడా పోలింగ్‌ ప్రక్రియ రికార్డ్‌ అవుతుంది. వెబ్‌ కాస్టింగ్‌ జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్‌ అధికారి, ఎన్నికల కమిషన్‌ వీక్షించే విదంగా ఉంటుంది. ఓటర్లు ఉదయం 7 గుంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్‌ సిబ్బందికి కూడా పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాం. ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేందుకు ప్రజలు సహకరించాలి. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగంచుకోవాలి. అలాగే నియోజకవర్గంలో హౌంఓటింగ్‌ ద్వారా 345మంది, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌కు సంబందించి 209 మంది, ఎన్నికల సిబ్బంది 1974, సర్వీస్‌ ఓట్స్‌ ఐదు, మొత్తం 2533 పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు.

అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన బందోబస్త్‌..
-ఎం.రమేష్‌, డిఎస్పీ, తెనాలి
ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగంచుకునేందుకు పటష్టమైన ఏర్పాట్లు చేశాం. 284మంది రౌడీషీటర్లను బైండోవర్‌ చేశాం. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. నిబంధనల మేరకు పోలింగ్‌ బూత్‌కు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి వాహనాల పార్కింగ్‌ చేయకూడదు. ఆ పరిధిలో మొబైల్‌ ఫోన్‌ కూడా ఉపయోగించకూడదు. పోలింగ్‌ స్టేషన్లకు సమీపంలోని నివాసాల్లో, అపార్ట్‌మెంట్లలోకి స్థానికేతరులను అనుమతించవద్దని కోరాం. నోటీసులు కూడా జారీ చేశాం. అలాంటివి గుర్తిస్తే ఓనర్లపై చర్యలు తప్పవు. లాడ్జిల్లోనూ చెకింగ్‌ ఉంది. మొబైల్‌ పార్టీలు కూడా బందోబస్త్‌లో ఉంటాయి. ఏపి పోలీస్‌తోపాటు టిఎస్‌ పోలీస్‌, సిఐఎస్‌ఎఫ్‌ బలగాలు మొహరించాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద సిసి కెమేరాలు ఉన్నాయి. ఎలాంటి ఘటన జరిగినా పోలీస్‌ అప్రమత్తమౌతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మూడు వాహనాలకు మాత్రమే ఆర్వో అనుమతిచ్చారు. ఒక వాహనంలో అభ్యర్ధి, రెండో వాహనంలో చీఫ్‌ ఏజంట్‌, అభ్యర్ధికి సంబందించి మూడో వాహనం ఉంటుంది. అభ్యర్ధి మాత్రమే పోలింగ్‌ స్టేషన్‌లోకి అనుమతిస్తారు. అయితే బూత్‌ వద్ద ప్రచారాలు నిషేదం. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు..

➡️