సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పట్టుదలతో పోరాడాలి : సిఐటియు

Jan 2,2024 15:38 #Anganwadi strike, #srikakulam

ప్రజాశక్తి- ఎచ్చెర్ల(శ్రీకాకుళం) : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పట్టుదలతో పోరాడాలని సిఐటియు ఆవిర్భావ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసు పిలుపునిచ్చారు. ఎచ్చెర్లలో అంగన్వాడీల సమ్మె శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం వెయ్యి రూపాయలు వేతనం మాత్రమే పెంచి ధరలు విపరీతంగా పెరిగినా గత నాలుగు సంవత్సరాలుగా వేతనాలు మాత్రం పెంచకపోతే ఏ విధంగా బ్రతకాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెంచి అమలు చేసిన వేతనం కూడా మేమే పెంచామని ముఖ్యమంత్రి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అంగన్వాడీలకు గ్రాట్యూటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ మన రాష్ట్రంలో అంగన్వాడీలకి గ్రాట్యూటీ అమలు చెయ్యటంలేదని అన్నారు. అంగన్వాడీలకు 11,500 వేతనం ఇచ్చి అమ్మ ఒడి, ఆసరా,చేయూత, విద్యా దీవెన, విడో పెన్షన్‌, ఒంటరి మహిళల పెన్షన్‌ వంటి సంక్షేమ పధకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేసారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు, వై.విజయలక్ష్మి, బి.కనకం, ధనలక్ష్మి, పొదిలాపు.సరస్వతి, మహదాసి.రాధిక, రాములమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.

➡️