22న ఓటరు జాబితా ఫైనల్‌ పబ్లికేషను విడుదల : కలెక్టర్‌ నిశాంత్‌

Jan 17,2024 14:44 #collector, #Manyam District

ప్రజాశక్తి-పార్వతీపురం : జనవరి 22వ తేదీన ఓటరు జాబితా ఫైనల్‌ పబ్లికేషను విడుదల చేయనున్నట్లు కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ చాంబరులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. జనవరి 22వ తేదీన ఓటరు జాబితా ఫైనల్‌ పబ్లికేషను విడుదల చేస్తామని తెలిపారు. తరువాత కూడా నామినేషన్లు చివరితేది వరకు ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా చేరుటకు అవకాశం ఉంటుందని, వారి పేర్లను సప్లిమెంటరీ జాబితా ద్వారా విడుదల చేస్తామని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు, అడ్రసు మార్పు, ఒకేడోరు నెంబరు తదితర సమారు 95 వేల సవరణలు చేసి సరిదిద్దడం జరిగిందని తెలిపారు. శుద్దమైన ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో ప్రతి విషయాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల దృష్ణికి తీసుకురావడం జరిగిందన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగు మిషన్లపై ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లాలో శాశ్వత సెంటర్లు, మొబైల్‌ ప్రదర్శన వ్యాన్‌లు ఏర్పాటు చేశామన్నారు.

జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు మాట్లాడుతూ.. జనవరి 1, 2024 నాటికి ప్రతిపాదిత ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో మొత్తం ఓటర్లు 7,70,525 మంది కాగా వారిలో 3,76,220 మంది పురుషులు, 3,94,240 మహిళలు, 65 మంది ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాపై జనవరి 17వ తేదీ వరకు వచ్చిన క్లైములు, అభ్యంతరాలను పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 186354 ఫారాలు స్వీకరించగా, వాటిలో 179811 ఫారాలు పరిష్కరించి ఓటరుజాబితాలో చేర్చడం జరిగిందని, 1262 ఆమోదం చేయడం జరిగిందని, 4991 తిరస్కరణకుగురయ్యాయని, 290 పరిష్కరించవలసి ఉన్నదని తెలిపారు.

ఈ సమావేశంలో బిజెపి ప్రతినిధి పారిశర్ల అప్పారావు, టిడిపి ప్రతినిధి జి. వెంకటనాయుడు, సిపిఐ(ఎం) ప్రతినిధి రెడ్డి వేణు, బి.ఎస్‌.పి. పార్టీ ప్రతినిధి టి. వెంకటరమణ, వైసిపి ప్రతినిధి సిహెచ్‌. సంతోష్‌ కుమార్‌, ఎస్‌. ఉమామహేశ్వరరావు పాల్గొని జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటరు జాబితా తయారీ ప్రకియలో ప్రతి విషయాన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేయడం వలన ఓటరు జాబితా తయారీపై అనుమానాలకు అవకాశం లేకుండా పోయిందని, రాష్టంలోనే ఎటువంటి పిర్యాదులు రాని జిల్లాగా మన జిల్లా ఉందని, స్వచ్చమైన ఓటరు జాబితా తయారీలో కషిచేసిన కలెక్టరుకు, జిల్లాయంత్రాగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.

➡️