రేపు ఎపి లా సెట్‌, పిజి లా సెట్‌ నోటిఫికేషన్‌

ప్రజాశక్తి – ఎఎన్‌యు (గుంటూరు జిల్లా) :ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ శాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఎపి లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌, ఎపి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024 నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని లాసెట్‌-2024 చైర్మన్‌, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విసి ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి.సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు వివరాలను వర్సిటీలోని లాసెట్‌ కార్యాలయంలో గురువారం వెల్లడించారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సు, రెండేళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు ఈ నెల 26వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్‌ 25 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 26 నుంచి మే 3వ తేదీ వరకు, రూ.వెయ్యి అపరాధంతో మే 4 నుంచి 11వ తేదీ వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో మే 12 నుంచి 20 వరకు, రూ.3 వేల అపరాధ రుసుంతో మే 21 నుంచి 29 వరకు దరఖాస్తు చేసుకునే వీలుందని వెల్లడించారు. దరఖాస్తులలో మార్పులు చేసుకునేందుకు మే 30 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు అవకాశం ఉంటుందని, జూన్‌ 3 నుంచి హాల్‌ టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. జూన్‌ 9న మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో పరీక్ష, 10న కీ విడుదల, 11, 12 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తామని వెల్లడించారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సుకు 10ం 2ం 3, యూజీ కోర్సులు ఉత్తీర్ణత సాధించిన వారు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్స్‌కు ఇంటర్మీడియట్‌, 10ం 2 కోర్సు పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎమ్‌ కోర్సుకు మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్స్‌ లేదా ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సు పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. 120 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుందని, 35 శాతం మార్కులు సాధించిన వారు అర్హత సాధిస్తారని తెలిపారు. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సెట్‌ కన్వీనర్‌ సత్యనారాయణ సూచించారు.

➡️