పనితీరు మెరుగుపడకుంటే చర్యలు తప్పవు

ప్రజాశక్తి-కడప పనితీరు మెరుగుపరుచుకోకుంటే చర్యలు తప్పవని జిల్లా విద్యుత్‌ శాఖ అధికారి ఎస్‌.రమణ అధికారులను హెచ్చరించారు. ప్రతి మనిషికి ప్రాథమిక అవసరాలలో విద్యుత్‌ కూడా ఒక భాగమైందన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉందని, చిన్నపాటి అంతరాయాలకు కూడా ప్రజలు సహించే పరిస్థితిలో లేరన్నారు. లైన్లను ట్రాన్స్‌ఫార్మర్లను ముందస్తుగా మరమ్మతులు చేసుకోవాలన్నారు. అత్యవసర పనులకు మాత్రమే విద్యుత్‌ను ఆపాలని చెప్పారు. బుధవారం కడప డివిజన్‌ విద్యుత్‌ కార్యాలయంలో కడప డివిజన్‌ పరిధిలోని కడప, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు, చెన్నూరు మండలాల క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి పథకాల పనులను అత్యధిక ప్రాధాన్యతతో యుద్ధప్రాదిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంతోనే అధిక శాతం విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. విద్యుత్‌ ప్రమాదాల పట్ల ఒక్క క్షణం ఆలోచించి భద్రత నియమాలను పాటించి విలువైన ప్రాణాన్ని కాపాడి ఒక కుటుంబాన్ని నిలబెట్టాలని తెలియజేశారు. లోఓల్టేజ్‌ సమస్యలు తలెత్తకుండా అవసరమైనన్ని కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయండని ఆదేశించారు. పగటిపూట వీధిలైట్లు వెలగకుండా తగు చర్యలు తీసుకోని విద్యుత్‌ వృథాను అరికట్టాలని హెచ్చరించారు. సంస్థ నెలరోజుల ముందు విద్యుత్‌ కొనుగోలు చేసి వినియోగదారులకు ఇస్తుంది, విద్యుత్‌ బకాయిల వసూళ్లలో రాజీ వద్దు, విద్యుత్‌ బకాయిలు వసూలు పై దష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టాలన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు. వాలిపోయిన స్తంభాలను, లూజు లైన్లను ఎప్పటికప్పుడు సరిచేయాలని ఆదేశించారు. తక్కువ ఎత్తులో ఉన్న లైన్లను గుర్తించి యుద్ధప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలన్నారు. పనితీరు మెరుగుపడకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో కడప డివిజన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, ఎఇలు, జెఇలు, అకౌంట్స్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️