liquor case: కజ్రీవాల్‌కు 14 రోజుల కస్టడీ

సిబిఐ కేసులో రౌస్‌ అవెన్యూ కోర్టు
బిజెపి ప్రధాన కార్యాలయం వద్ద ఆప్‌ శ్రేణుల ఆందోళన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు శనివారం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను ఇటీవల అరెస్ట్‌ చేసిన సిబిఐ, ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. దాంతో కోర్టు మూడు రోజుల సిబిఐ రిమాండ్‌ విధించింది. ఈ మూడు రోజుల రిమాండ్‌ ముగియడంతో శనివారం అధికారులు మరోసారి కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చారు. విచారణ కోసం కేజ్రీవాల్‌ను రెండు వారాల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించాలని కోర్టును సిబిఐ కోరింది. దాంతో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కేజ్రీవాల్‌ను తీహార్‌ జైలుకు తరలించారు. జూలై 12 వరకు కేజ్రీవాల్‌ రిమాండ్‌ కొనసాగనుంది.
ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు కేజ్రీవాల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 19న అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇడి కస్టడీలోనే తీహార్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను అదే కేసులో నాలుగు రోజుల క్రితం సిబిఐ అరెస్ట్‌ చేసింది. ఇడి కేసులో రౌస్‌ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. దీన్ని ఇడి సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా, హైకోర్టు విచారణలో ఉన్నందున, స్టే విధించింది. దీంతో ఆయన తీహార్‌ జైలులోనే ఉండాల్సి వచ్చింది.
బిజెపి కేంద్ర కార్యాలయం వద్ద ఆప్‌ ఆందోళన
కేజ్రీవాల్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని బిజెపిని ఆమ్‌ ఆద్మీ పార్టీ డిమాండ్‌ చేసింది. శనివారం ఢిల్లీలోని దీన్‌ దయాళ్‌ ఉపాద్యాయ మార్గ్‌లోని బిజెపి కేంద్ర కార్యాలయం ఎదుట ఆప్‌ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం, నియంత పాలన అంతం.. కోసం అంటూ పార్టీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, పెద్దపెట్టున నినాదాలు చేశాయి. బిజెపి కేంద్ర కార్యాలయం వద్దకు అనుమతి లేదంటూ ఆప్‌కి చెందిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

➡️