నీట్‌ అర్హతా పరీక్షను వెంటనే రద్దు చేయాలి : శంకర్రావు

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : దేశవ్యాప్తంగా డాక్టర్లను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వైద్య విద్యార్హతా పరీక్ష నిర్వహణకు, నియమించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌.టి.ఏ) ద్వారా జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌ అర్హత పరీక్షను రద్దు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు శనివారం మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ … లీకేజీ కి పాల్పడిన వ్యవహారంపై సుప్రీం కోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు జీవితాలకు సంబంధించి ఎంతో జాగరుకతతోను, కఠిన నిబంధనలతో జరపాల్సిన నీట్‌ అర్హత పరీక్ష నిర్వహణ విషయంలో, లీకేజీకి పాల్పడే అవకాశం కల్పించబడటం దురదఅష్టకరమన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎన్‌.టి.ఏ కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. ఎన్‌.టి.ఏ నిర్వాకం వల్లనే దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని శ్రీకేసన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం,ఎన్‌.టి.ఏ ల ఉదాసీన వైఖరితో నీట్‌ నిర్వహణ జరపడం వల్లే బీహార్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో పేపర్‌ లీకేజీ జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా భేష్ఠజాలకు పోకుండా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మెరిట్‌ విద్యార్థులకు, ఇటు రిజర్వేషన్‌ వర్గాలకు న్యాయం జరగడానికి వీలుగా నీట్‌ పరీక్షను తక్షణమే రద్దు చేయడం ఏకైక మార్గం అన్నారు. జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్‌ మాట్లాడుతూ … నీట్‌ నిర్వహణలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ తప్పక నిజానిజాలను వెలికితీస్తుందని ఆశిస్తున్నామన్నారు. మార్కుల గణనలో ఇష్టారీతిన వ్యవహరించిన ఎన్‌.టి.ఏ కు సుప్రీం కోర్టు కూడా నోటీసులు ఇచ్చిందన్నారు. ఇకపై అర్హతా పరీక్షలన్నిటిని ఎట్టి అవకతవకలు జరగకుండా, సక్రమంగా నిర్వహించేలా కఠిన చట్టాలను తీసుకురావాలన్నారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. లేకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలతో కలసి విద్యార్థుల్లోకానికి మద్దతుగా మెరుపు దీక్షలకు పాల్పడాల్సి వస్తుందని మహేష్‌ హెచ్చరించారు. ఈ సమావేశంలో యువజన ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంతరావు, యువజన రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉప్పాలరాజ్‌ కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️