కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ ప్రారంభం

Apr 4,2024 21:36

ప్రజాశక్తి-విజయనగరం: ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధించిన సమాచా రాన్ని మీడియాకు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అందిన ఫిర్యాదులను కలెక్టర్‌ వివరించారు. ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా, దానిపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నుంచి నేటివరకు వివిధ మార్గాల్లో 280 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 276 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. సి-విజిల్‌ ద్వారా 121, కాల్‌ సెంటర్‌కు 41, ఎన్‌జిఎస్‌పి పోర్టల్‌ ద్వారా 66, మీడియా ద్వారా 50, సోషల్‌ మీడియా ద్వారా 2 ఫిర్యాదులు అందాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు కోటి రూపాయల విలువైన నగదు, మద్యం, వివిధ రకాల వస్తువులను సీజ్‌చేసినట్లు చెప్పారు. దీనిలో రూ.11.20 లక్షల నగదు, రూ.35.03 లక్షల విలువైన మద్యం, రూ.20.83 విలువైన డ్రగ్స్‌, రూ.2లక్షల విలువైన ఆభరణాలు, రూ.30.02 లక్షల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు 15 మంది వాలంటీర్లను తొలగించామని, ఇద్దరిపై కేసులు నమోదు చేశామని, ఇద్దరు రేషన్‌ డీలర్లపైనా కేసులు పెట్టామని, ఇద్దరు రేషన్‌ డీలర్లను తొలగించామని, రాజకీయ పార్టీలపై ఇప్పటివరకు 11కేసులు నమోదు చేశామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, సిపిఒ పి.బాలాజీ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి డి.రమేష్‌, ఇతర అధికారులు, సిబ్బంది, పాత్రికేయులు పాల్గొన్నారు.కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించిన కలెక్టర్‌ఎన్నికల కంట్రోల్‌ రూమును జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సందర్శించారు. వివిధ విభాగాల వద్దకు వెళ్లి, ఇప్పటివరకు అందిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. అధికారులతో చర్చించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఓ ఎస్‌డి అనిత, ఇతర అధికారులు ఉన్నారు.

➡️