సోషల్‌ మీడియాలో భర్తే అసభ్యకర పోస్టులు

Nov 20,2023 23:23 #palnadu district

 

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘జగనన్నకు చెబుదాం’కు ఆస్తి, కుటుంబ వివాదాలు, ఆర్థిక మోసాలపై అధికంగా ఫిర్యాదులు అందాయని దిశా డీఎస్పీ యు.రవి చంద్ర తెలిపారు. ఈ మేరకు ఆయన అర్జిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జిదార్లకు నరసరావుపేటకు చెందిన చెన్న సురేష్‌ భోజనాన్ని ఏర్పాటు చేశారు.
భర్త నుండి విడాకులకు దరఖాస్తు చేసుకున్న మండల కేంద్రమైన నాదెండ్లకు చెందిన మహిళకు మ్యాట్రిమోనీలో పరిచయమైన ఒంగోలుకు చెందిన బొల్లినేని అజిత్‌.. తాను కూడా భార్య నుండి విడాకులు తీసుకున్నానని, పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాడని, తెలిసిన న్యాయవాది ఉన్నాడని, త్వరగా విడాకులు ఇప్పిస్తారంటూ దశల వారీగా రూ.25 లక్షలు తీసుకుని మోసం చేశాడని బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. దీనిపై నాదెండ్ల, ఒంగోలు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు.
భర్తతో స్పర్థల కారణంగా రెండేళ్లుగా విడిగా ఉంటున్నానని, అయితే నెలరోజుల నుండి తన భర్త సోషల్‌ మీడియాలో తన గురించి అసభ్యంగా ప్రచారం చేయడం తోపాటు ఇబ్బందికరమైన ఫొటోలు పెడుతున్నారని గురజాల మండలానికి చెందిన మహిళ ఫిర్యాదు చేశారు.
ఎటిఎం కార్డు ఇచ్చినందుకు రూ.1.38 లక్షల మోసం
రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స కోసం నరసరావుపేట ప్రయివేటు హాస్పిటల్‌కు వెళుతున్న క్రమంలో ఆటో డ్రైవర్‌ కిరణ్‌కు డబ్బులు డ్రా చేయాలని ఎటిఎం కార్డు ఇవ్వగా దశల వారీగా రూ.1.38 లక్షలు కాజేశాడని నకరికల్లు మండలం చల్లగుండ్లకు చెందిన విపరాపట్నం శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. దీనిపై నకరికల్లు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
డబ్బు తీసుకుని అక్రమ కేసు
తన కుమార్తె వివాహం సందర్భంగా కారు ఏర్పాటు చేయించిన చిట్టిపోలు శేఖర్‌బాబు తర్వాత ఆ కారు కొనుగోలు చేయాలంటూ రూ.6 లక్షలు తీసుకుని గ్రామం నుండి హైదరాబాద్‌కు పరారయ్యాడని, డబ్బులు తిరిగివ్వాలన్నందుకు తనపై అక్రమంగా కేసు పెట్టాడని మాచర్ల బెల్లంకొండవారిపాలేనికి చెందిన బెల్లంకొండ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశాడు. దీనిపై తాను మాచర్ల పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు.
పొలం కాజేయాలని చూస్తున్నారు
తన భర్తకు వారసత్వంగా వచ్చిన ఎకరా పొలాన్ని కాజేయడానికి అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌ సమీప బంధువైన అచ్చంపేట మండ లం నిండుజర్లకు చెందిన కుందురు రామాంజనేయులు యత్నిస్తున్నారని అదే గ్రామానికి చెందిన కుందురు గంగమ్మ ఫిర్యాదు చేశారు. తమ పొలంలో అక్రమంగా రోడ్డు పోశారని, అచ్చంపేట పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. తమ కుటుంబానికి ఆ పొలమే ఆధారమని, దీనిపై గతంలో ఉన్న వివాదాలు కోర్టు ద్వారా పరిష్కారం చేసుకున్నామని, అయినా ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు.
ఆన్‌లైన్‌లో రూ.30 లక్షల మోసం
ఆన్‌లైన్‌లో విమానం టిక్కెట్లు బుక్‌ చేస్తే కమీషన్‌ ఇస్తామని చెప్పిన వారు తర్వాత రూ.30 లక్షల వరకు తీసుకొని ఇవ్వడం లేదని, స్కై స్కాన్‌ వర్కింగ్‌ డాట్‌ కాం అనే సంస్థ ప్రతినిధులు తనను మోసం చేశారని నరసరావుపేట పట్టణం కాకతీయ నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిర్యాదు చేశారు.

➡️