జిల్లాలో పారిశ్రామిక సంక్షోభం

May 25,2024 20:34

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : అసలే విజయనగరం జిల్లా పారిశ్రామికంగా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ప్రభుత్వ విధానాలు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి మాట అటుంచితే… ఉన్న ఉద్యోగాలు, ఉపాధి కూడా లేకుండా పోతున్నాయి. దీంతో, ఏటా వేలాది మంది జీవనోపాధి కోసం వలసపోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈనెల 18న కొత్తవలస పారిశ్రామికవాడలోని జిందాల్‌ పరిశ్రమ మూత కార్మికవర్గాన్ని మరింత కలవరపెట్టింది. మొత్తం 450మంది కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి. ఈ మాటకొస్తే జిల్లాలో అనేక పరిశ్రమలు ఏటా మూతపడుతునే ఉన్నాయి. ఒకప్పుడు ఫెర్రోఎల్లాయీస్‌ పరిశ్రమలకు పుట్టినిల్లుగావున్న విజయనగరం జిల్లా నేడు తిరోగమిస్తోంది. జిల్లాలో గరివిడి, గుర్ల, మెరకముడిదాం, బొబ్బిలి, కొత్తవలస ప్రాంతాల్లో 21 వరకు ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు ఉండేవి. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి విద్యుత్‌ ఛార్జీలు పెంచడంతో భారాన్ని తట్టుకోలేక బొబ్బిలిలో ఉన్న యోన, ఇంపెక్స్‌ గరివిడిలో ఉన్న ఆంధ్రా ఫెర్రో సహా మొత్తం 10 పరిశ్రమలు మూతపడ్డాయి. గరివిడి ఫేకర్‌లో ఉత్పత్తి తగ్గించడం వల్ల ఒకే ఒక్క ఫర్నేచర్‌ నడుస్తోంది. బొబ్బిలిలోని సిరి ఫెర్రో ఒడిదొడుకుల మధ్య నడుస్తోంది. ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణం. ఫెర్రో క్రోమ్‌ ఉత్పత్తిలో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఛార్జీలు పెంచితే అనివార్యంగా వాటి మనుగడ భారమౌతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా విజయనగరం జిల్లాలోనూ ఒకప్పుడు జ్యూట్‌ మిల్లులు ఎక్కువగా ఉండేవి. జనపనార, గోగు (మెస్తా) కలిపి జ్యూట్‌ ఉత్పత్తులు తయారవుతాయి. ఉత్తరాంధ్ర నేలలు గోగు సాగుకు అనుకూలంగా ఉండడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా జ్యూట్‌మిల్లులు ఆవిర్భవించాయి. ప్రభుత్వ విధానాల కారణంగా 1990 తరువాత కాలంలో జ్యూట్‌ ఉత్పత్తుల స్థానంలో ప్లాస్టిక్‌, మైకా వంటి ప్రత్యామ్నాయ ఉత్పత్తులు అందుబాటులోకి తేవడం, నార కొనుగోలుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం వంటి కారణాల వల్ల గోగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోయింది. ఈ ప్రభావం జూట్‌ ఉత్పత్తులపైనా పడింది. దీంతో, ఒకప్పుడున్న తొమ్మిది జ్యూట్‌ మిల్లులకుగాను ఒకటే నడుస్తోంది. నెల్లిమర్ల జ్యూట్‌మిల్లులో 8ఏళ్ల క్రితం 5వేల మంది నుంచి 6వేల మంది కార్మికులతో కళకళలాడేది. ప్రస్తుతం 1500 మంది మాత్రమే పనిచేస్తున్నారు. సాలూరు జీగిరాం జ్యూట్‌ మిల్లు ఎప్పటికప్పుడు లాకౌట్‌కు గురవుతోంది. మిగిలినవన్నీ దాదాపు ఉనికి కోల్పోయాయి. ముఖ్యంగా విజయనగరంలోని అరుణా, ఈస్టుకోస్టు, బొబ్బిలిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస శాశ్వతంగా మూతపడ్డాయి. జిల్లాలో భీమసింగి, లచ్చయ్యపేట సుగర్‌ ఫ్యాక్టరీలు ఉండడంతో ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా 10,473 హెక్టార్లు మేర చెరకు విస్తీర్ణం ఉండేది. వాటిని ఆధునీకరించకపోవడంతో ప్రస్తుతం 3830 హెక్టార్లకు తగ్గింది. ఆర్థిక సంక్షోభం పేరుతో లచ్చయ్యపేట సుగర్స్‌, చెరకు విస్తీర్ణం తగ్గిపోయిందనే పేరుతో భీమసింగి ఫ్యాక్టరీ మూసివేయడంతో వేలాది మంది రైతులు, ఇటు కార్మికులు ఉపాధి కోల్పోయారు. పరిశ్రమల మూత వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోవడంతో ఆయా కుటుంబాలవారి ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయి. దీంతో, పారిశ్రామిక రంగంలో జిల్లాకు వస్తున్న ఆదాయం కూడా ఘననీయంగా తగ్గిపోతోంది. ఎన్నికల నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగాలు కల్పన పేరిట తెగేసి హామీలు గుప్పించిన నేతలు ప్రస్తుతం పత్తాలేకుండా పోయారు. దీంతో, కార్మికుల జీవనం దినదిన గండంగా మారింది.

➡️