అతివల ఓటర్లపై గురి..!

Mar 24,2024 23:06
సార్వత్రిక ఎన్నికల సమయం

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు మే 13 న పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఆయా రాజకీయ పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో మహిళా ఓటర్లపై పార్టీలు ప్రధానంగా గురి పెట్టనున్నాయి. వారిని ప్రసన్నం చేసుకునే అన్ని అంశాలపై దీష్టి సారిస్తున్నాయి. మహిళా ఓటర్లదే పై చేయికాకినాడ జిల్లాలో మొత్తం 15,99,065 మంది ఓటరులుండగా వీరిలో మహిళలు 8,10,781 మంది, పురుషులు 7,88,105 మంది ఉండగా ఇతరులు 179 మంది మాత్రమే ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం మినహా తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. తుది జాబితా ప్రకారం జిల్లాలో మహిళా ఓటర్లే అగ్రస్థానంలో ఉన్నారు. లోక్‌సభ, శాసన సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇంటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న అతివలను ఆకర్షిస్తే ఇంట్లో ఓట్లన్నీ తమ వైపు రాబట్టుకోవచ్చునని ఆయా పార్టీల నేతలు యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రధానంగా వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ప్రధాన పార్టీలు ఎన్నికల హామీలను, మ్యానిఫెస్టోలను మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రకటించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. వారి పేరుతోనే పథకాలు ప్రధానంగా వైసిపి గడచిన ఐదేళ్లలో నవరత్నాలు పథకాలను మహిళల పేరుతోనే అమలు చేస్తోంది. అమ్మఒడి, కాపునేస్తం, అందరికీ ఇళ్ళు, వైఎస్‌ఆర్‌ చేయూత, డ్వాక్రా రుణాలు ఇలా అనేక పథకాలను వైసిపి మహిళలను ఉద్దేశించే ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. గడచిన ఐదేళ్లలో అమలు చేసిన పథకాలను వివరిస్తూనే మహిళ ఓట్లే లక్ష్యంగా వైసిపి ప్రచారం మొదలుపెట్టింది. మరోవైపు టిడిపి కూడా మహిళల పక్షపాతి అని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తొలివిడతలో సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రకటించారు. ప్రతి ఇంటికి యేడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు రూ.1500 నగదు, రైతుకు రూ.20వేలు పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు నగదు తదితర పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. వాటిని కూటమి అభ్యర్థులు కింద స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పూర్తి మేనిఫెస్టోని త్వరలో విడుదల చేసి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామంటూ అభ్యర్థులు ప్రచారాలను మొదలుపెట్టారు. అధికారంలో లేనప్పుడే సొంత డబ్బు ఖర్చు చేసి మరీ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజలను ఆదుకుంటున్నామని, తాము అధికారంలోకి వస్తే మరింత సంక్షేమం ఇస్తామని పలు సందర్భాల్లో పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. పొత్తులో భాగంగా కూటమిగా అనేక మహిళా సంక్షేమ పథకాలను తీసుకొస్తామని కూడా చెబుతున్నారు. ఇలా మహిళా ఓట్లే తమ లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో పార్టీలు దృష్టిని సారించనున్నాయి. వైసిపి అలాగే టిడిపి, జనసేన కూటమి మహిళలను ఆకర్షించే విధంగా త్వరలోనే మేనిఫెస్టోలను కూడా విడుదల చేయనున్నారు.వారి ఓట్లే కీలకంఈ సార్వత్రిక ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను తమవైపుకు తిప్పుకుని ప్రయోజనం పొందేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. జరగబోయే లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల యంత్రాంగం పనిచేస్తుంది. గడచిన ఎన్నికల్లో 70 శాతం పైగా మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కుని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో ఆయా పార్టీలు మహిళా ఓటర్లే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో మహిళా ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో వేచి చూడాలి.

➡️