ఏ సీటు ఎవరికి..?

Mar 12,2024 23:48
రాష్ట్రంలోనే అత్యధిక శాసనసభ స్థానాలు కలిగిన

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

రాష్ట్రంలోనే అత్యధిక శాసనసభ స్థానాలు కలిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విపక్ష కూటమి సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ స్థానంలో ఏ పార్టీ బరిలో ఉండాలనే దానిపై పంపకాలు కూడా చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి మూడింట రెండొంతుల స్థానాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బరిలో దిగబోతోంది. మొత్తం 21 స్థానాలకు 15 సీట్లలో ఆ పార్టీ పోటీ చేస్తుంది. మిగిలిన ఆరు స్థానాలకు 5 చోట్ల జనసేన అభ్యర్థులు, ఒకచోట బిజెపి బరిలో ఉంటాయి. 2014 ఎన్నికల్లో బిజెపి గెలిచిన రాజమహేంద్రవరం అర్బన్‌కు మరోసారి ఆ పార్టీ అభ్యర్థి పోటీ చేయబోతున్నారు. బిజెపి సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బిజెపి అధిష్టానం నుంచి ఆయనకు సంకేతాలు వచ్చినట్టు చెబుతున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు సీటు కూడా బిజెపి ఖాతాలో పడడంతో ఎంపీ స్థానం పరిధిలో ఒక అసెంబ్లీ సీటుకి బరిలో ఉండేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అందుకు అనుగుణంగా రాజమహేంద్రవరం అర్బన్‌ సీటును బిజెపి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇక జనసేనకు ఐదు స్థానాలు దక్కాయి. మూడు పార్టీల కీలక నేతలు అమరావతిలో జరిపిన చర్చల తర్వాత ఎవరు ఎక్కడ బరిలో ఉండాలన్న దానిపై తాజాగా స్పష్టత వచ్చింది. దానికి తగ్గట్టుగా నియోజకవర్గస్థాయి నేతలకు కూడా సమాచారం అందిస్తున్నారు. దాన్ని బట్టి జిల్లాలో ఇప్పటికే ప్రకటించిన రాజానగరం, కాకినాడ రూరల్‌ స్థానాలతో పాటుగా జనసేన సిట్టింగ్‌ సీటు రాజోలులో కూడా ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారు. ఈ మూడు స్థానాలతో పాటు అమలాపురం, పిఠాపురం, రామచంద్రపురం స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. రామచంద్రాపురం కోసం టిడిపి కూడా పట్టుబడుతుంది. శెట్టిబలిజకు జిల్లాలో ఒక సీటు కేటాయించడం అనివార్యం కావడంతో టిడిపి ఆస్థానం కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది. అదే జరిగితే జిల్లాలో మరొక స్థానం జనసేనకు దక్కుతుందా లేక ఐదు సీట్లతో సరు పెట్టుకోవాల్సి వస్తుందా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.ఇక జనసేన బిజెపికి కలిపి ఆరు లేదా ఏడు స్థానాలు ఖాయం కావడంతో మిగిలిన 14 లేదా 15 సీట్లలో టిడిపి అభ్యర్థులు పోటీలో ఉంటారు. ఇప్పటికే తుని, జగ్గంపేట, పెద్దాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, అనపర్తి, రాజమహేంద్రవరం సిటీ స్థానాల్లో అభ్యర్థులను టిడిపి ఖరారు చేసింది. అయితే రాజమహేంద్రవరం సిటీ స్థానాన్ని ఇప్పటికే సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ భర్త ఆదిరెడ్డి వాసుకు ఖరారు చేసింది. ఆయన ఇప్పటికే ప్రచారంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ సీటను బిజెపికి కేటాయిస్తారా లేదా? అనేది సందిగ్ధంలో ఉంది. కాకినాడ సిటీ విషయంలోనూ టిడిపి భారీగా కసరత్తు చేస్తుంది. జిల్లాలో ఒక్క సీట్‌ అయినా మత్స్యకారులకు కేటాయించాల్సిన అవసరం ఉండడంతో మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు పేరు ఖరారు చేసే అవకాశం ఎక్కువ ఉంది. పి.గన్నవరం అసెంబ్లీ సీటును మహాసేన రాజేష్‌కి కేటాయించినప్పటికీ రాజకీయంగా ఎదురైన సవాళ్లతో ఆయన్ను ఉపసంహరించాల్సి వచ్చింది. ఇక కందుల దుర్గేష్‌కు నిడదవోలు కేటాయించడంతో రాజమహేంద్రవరం రూరల్‌ స్థానంలో టిడిపి తరపున గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు ఖరారైంది. టిడిపి లిస్టులో 8 స్థానాలకు అభ్యర్థులకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. మిగిలిన ఆరు లేదా ఏడు సీట్లలో ఎవరికి అవకాశం వస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అందులో ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, రామచంద్రపురం, పి.గన్నవరం, గోపాలపురం, కొవ్వూరు ఉన్నాయి. ఈ సీట్లలో ఇప్పటికే ఆశావాహులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. అమలాపురం సీటు జనసేన ఖాతాలో పడితే ఆ సీటును ఆశిస్తున్న మాజీ ఎంఎల్‌ఎ అయితాబత్తుల ఆనందరావు పి.గన్నవరం సీటును కోరే అవకాశం ఉంది. ప్రత్తిపాడులో ఇప్పటికే వరుపుల రాజా భార్య సత్యప్రభ చురుగ్గా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే బలమైన వర్గం కూడా కనిపిస్తోంది. ఇక రామచంద్రాపురం సీటు కోసం ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల వ్యవహారం ఒక కొలిక్కి రావడంతో నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను కూడా ఖరారు చేయనున్నారు.

➡️