రజకుల ఆస్తులకు రక్షణ కల్పించాలి

Feb 9,2024 22:38
రజకుల ఆస్తులకు రక్షణ కల్పించాలి

ప్రజాశక్తి-కాకినాడరాష్ట్రవ్యాప్తంగా రజక వృత్తిదారులకు చెందిన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని వాటికి రక్షణ కల్పించాలని, రజకులకు ఉపాధి, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఎపి రజక వృత్తిదారుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. కాకినాడలోని సుందరయ్య భవనంలో శుక్రవారం సంఘం ఆరో జిల్లా మహాసభల్లో సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు మాట్లాడారు. రజకుల సమస్యలు పేరుకు పోయాయని, తమకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. కుటుంబ పోషణ, ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వలస పోతున్నారని వాటిని అరికట్టాలని సూచించారు. రాష్ట్రంలో సుమారుగా 25 లక్షల రజక కుటుంబాలు ఉన్నాయని వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బతుకుదెరువు చాలా కష్టతరంగా మారిందన్నారు. తమ హక్కుల కోసం, జీవోల అమలు కోసం ఉద్యమ చేయాలని కోనేటి రాజు పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రజకుల అభివద్ధికి గతంలో ఫెడరేషన్‌ ఏర్పాటు చేసిందని దాన్ని ఇప్పుడు కార్పొరేషన్‌గా మార్చినా ఏ ఒక్కరికీ రుణాలు అందించకపోగా ఉపాధి చూపించలేదన్నారు. కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి చైర్మన్‌, డైరెక్టర్లును నియమించినా వారు రుణాలు ఇప్పించిన దాఖలాలు లేకపోగా ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు. మడక రాజు, రజక నాయకులు కాకినాడ రామారావు, కె.నాగేశ్వరరావు, కె.మాణిక్యం, ఎవిడి మెంటారావు, ఎం.ఈశ్వరరావు, గొల్తి సత్యనారాయణ, పోలేపల్లి నారాయణ, రాజు, చంటి, రాజశేఖర్‌, అజరు, కె.రామకృష్ణ, చోడవరపు సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️