డయేరియా నియంత్రణకు పటిష్ట చర్యలు

Jun 26,2024 22:58
నియంత్రణకు సమగ్ర కార్యచరణ

ప్రజాశక్తి – కాకినాడ

జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణకు సమగ్ర కార్యచరణ ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పలు ప్రభుత్వ శాఖల అధికారులతో డయేరియా వ్యాధిపై సమీక్షా సమా వేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్‌ డయేరియా కార్యక్రమం అమలు, జిల్లాలో డయేరియా వ్యాధి బారిన పడిన వారి వివరాలు, జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, మంచినీటి పరీక్షలు, తాగునీరు పైపులైన్ల తనిఖీ, లీకేజీలు, మరమ్మతుల పనులు, మంచినీరు ట్యాంకుల క్లోరినేషన్‌ ప్రక్రియ, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు వంటి అంశాలపై కలెక్టర్‌ క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని పంచాయితీ, మున్సిపాలిటీలతోపాటు, అంగన్‌వాడీ, వసతి గృహాలు, పాఠశాలలో డయేరియా వ్యాధి నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే జిల్లాలో కొమానపల్లి, బెండపూడి, వేట్లపాలెం గ్రామాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయని, ఈ ప్రాంతాల్లో డయేరియా వ్యాధి ప్రబలడానికి కారణమైన అంశాలను, సేకరించిన తాగునీరు ఇతర నమూనాల వివరాలను ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్‌ డయేరియా కార్యక్రమం జిల్లాలో సక్రమంగా నిర్వహించేలా అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డయేరియా వ్యాధి ప్రబలకుండా కాచి చల్లార్చిన వేడి నీళ్లు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు. ఇందుకు వైద్య ఆరోగ్యశాఖ అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. మరో దఫా అన్ని ప్రాంతాల్లో తాగునీరు పైపులైన్ల తనిఖీ చేసి లికేజీ, మరమత్తుల వివరాలు సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. జూలై 5 నాటికి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు పరీక్షలు నిర్వహించా లన్నారు. జూన్‌ 31 నాటికి అన్ని ఇనిస్టిట్యూషన్స్‌లో ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్ల, జింక్‌ టాబ్లెట్స్‌ పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో మంచినీరు ట్యాంకుల క్లోరినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. అధికారులంతా సమన్వయంతో స్టాప్‌ డయోరియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం స్టాప్‌ డయేరియాకి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ జె.నరసింహనాయక్‌, డిఇఒ డాక్టర్‌ రత్నకుమార్‌, జడ్‌పి సిఇఒ ఎ.శ్రీరామచంద్రమూర్తి, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్య, డిఇఒ పి.రమేష్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ ఎం.శ్రీనివాసు, డిపిఒ కె.భారతిసౌజన్య, పౌర సంబంధాల శాఖ డిడి డి.నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ జెడి డివి.రమణమూర్తి, ఐసి డిఎస్‌ పీడీ కె.ప్రవీణ, బిసి సంక్షేమ అధికారి ఎం.లల్లి, డిటిడబ్ల్యూఒ ఎం.విజయశాంతి, మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️