సమస్యల వలయంలో జిజిహెచ్‌

Feb 25,2024 23:23
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పేద ప్రజల

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పేద ప్రజల ఆరోగ్యానికి పెద్ద భరోసాగా నిలుస్తుంది. అయితే కొన్నేళ్లుగా సమస్యల వలయంలో చిక్కుకుని విలవిలాడుతోంది. అసౌకర్యాల చెరలో కొట్టుమిట్టాడుతుంది. ఆసుపత్రిలో కీలక సమస్యల పరిస్కారానికి ఆయువు పట్టుగా నిలవాల్సిన ఆసుపత్రి అభివృద్ధి మండలి (హెచ్‌డిఎస్‌) ఉన్నా తూతూ మంత్రంగా మాత్రమే సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న హెచ్‌డిఎస్‌ ఉన్నా సామాన్యులకు అవస్థలు తప్పడంలేదు.చుట్టుముడుతున్న సమస్యలు 1165 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో సుమారు 2 వేల మంది ఇన్‌ పేషేంట్లుగా ఉంటూ ప్రతీ రోజూ చికిత్స పొందుతున్నారు. అయితే సరిపడినన్ని పడకలు లేకపోవడంతో ఒకే మంచంపై ఇద్దరు, ఒక్కో సందర్భంలో ముగ్గురు రోగులను ఉంచుతున్నారు. అత్యవసర చికిత్స విభాగంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విధి లేని పరిస్థితుల్లో ఒకే మంచంపై ఇద్దరూ, ముగ్గురు రోగులకు వైద్యులు చికిత్సను అందిస్తున్న దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఎప్పటికీ మారుతుందో అటు రోగులకు, ఇటు వైద్యాధికారులకు అంతు పట్టడం లేదు. అలాగే లిఫ్ట్‌ సౌకర్యం ఉన్నా ప్రస్తుత మరమ్మతులకు గురవడంతో రోగులు మొదటి అంతస్తులోకి వెళ్లాలంటే నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వారి బంధువులు పలు సందర్భాల్లో మోసుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి ఆవరణలో గత నాలుగేళ్లుగా నిర్మిస్తున్న ఎంసిహెచ్‌ బ్లాకు ఇంకా పూర్తి కాలేదు. నిధుల విడుదలలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుండడంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేశారు. ప్రస్తుతం కొంతకాలంగా పనులు సాగుతున్నా ఎప్పటికీ అందుబాటులోకి వస్తుందో స్పష్టత లేదు. ఈ బ్లాకు పనులు గనక పూర్తయితే తల్లి బిడ్డలకు సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కార్డియాలజీ చికిత్స కోసం ప్రత్యేకంగా విభాగాన్ని నిర్మించినప్పటికీ గుండె వ్యాధితో వస్తున్న పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. కార్డియాలజీ విభాగానికి చెందిన వైద్యులకు స్వయం ప్రతిపత్తి కల్పించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విభాగంపై అవగాహన లేని మెడిసిన్‌ హెచ్‌ఒడి కంట్రోల్‌లో పనిచేస్తుండడం వలన సంతృప్తి స్థాయిలో గుండె వ్యాధి నిపుణులు వైద్య సేవలు అందించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాథ్‌ల్యాబ్‌ అందుబాటులో ఉన్నా పూర్తిస్థాయి సేవలు అందించకపోవడంతో రోగులు వెను తిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య సేవలు కూడా అందుబాటులోకి రావాల్సి ఉంది. అలాగే ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్లు చేస్తున్నప్పటికీ సకాలంలో రిపోర్టులు ఇవ్వలేకపోతున్నారు. దాంతో వైద్య సేవలు అందించడంలో జాప్యం చోటు చేసుకుంటుంది. ఇలా అనేక సమస్యలు ఏళ్లు తరబడి వేధిస్తున్నా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.తూతూ మంత్రంగా సమావేశాలు రోజుకి 3 వేల నుంచి 3,500 మంది మంది రోగులు వచ్చే కాకినాడ జిజిహెచ్‌లో సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. జబ్బులతో వచ్చే రోగులకు వైద్యసేవలు అందించడంలో లోనూ, పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో నెలకున్న సమస్యలను గుర్తించి, తగు చర్యలను చర్చించి వాటి పరిష్కారానికి గతంలో గట్టి కృషి జరిగేది. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌ గా, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ కన్వీనర్‌గా 2014కి ముందు ఆసుపత్రి అభివృద్ధి మండలి సమావేశాలు 3 నెలలకోసారి జరిగేవి. హెచ్‌డిఎస్‌ సమావేశానికి ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపిలు, జడ్‌పి చైర్మన్‌ విధిగా హజరయ్యేవారు. వీరితోబాటు జిజిహెచ్‌లో హెచ్‌ఒడిలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సభ్యులుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం హెచ్‌డిఎస్‌ సమావేశాలు 4 నెలలకోసారి జరుగుతున్నాయి. ఈ సమావేశాలు నిర్థిష్టమైన సమయానికి కాకుండా జరుగుతున్నా నామ్‌కే వాస్తి అన్నట్లుగా సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చేసిన పనులను ప్రస్తావిస్తూ, చేయబోయే అభివృద్ధి పనులను గురించి చర్చించడం, అందుకు అవసరమైన నిధులకు సంబంధించి ప్రతిపాదనలు చేయడం వరకూ మాత్రమే హెచ్‌డిఎస్‌ సమావేశాలు ఉంటున్నాయనే వాదన లేకపోలేదు. ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లు పరిస్థితి ఉంది. ప్రస్తుతం 1165 పడకలు కల్గిన జిజిహెచ్‌లో ముందు 1500కు, తర్వాత 1900కు, చివరకు 2,300కు పడకల స్థాయిని పెంచాలని తీర్మానాలను ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను అమలు చేయించుకోవడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు హెచ్‌డిఎస్‌ సమావేశాలను తూతూ మంత్రంగా జరుపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఆసుపత్రి సూపరింటెండెంట్‌, హెచ్‌ఒడిలు మాత్రమే సమావేశాలను జరిపి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు.

➡️