న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

Dec 31,2023 16:56 #Kakinada
citu round table meeting on strike

 

  •  ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
  • దుబారా తగ్గించుకుని వేతనాలు పెంచాలని జగన్ కి హితవు

ప్రజాశక్తి-కాకినాడ : సిఐటియు ఆధ్వర్యంలో ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం అంగన్వాడీ, సమగ్రశిక్షా ఉద్యోగుల, మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెలను విరమింపచేయలని కోరుతూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి అధ్యక్షతన కచేరిపేట నందుగల జిల్లా కార్యాలయంలో జరిగింది.

ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, అంగన్వాడీ జిల్లా కార్యవర్గ సభ్యులు జ్యోతి, సమగ్రశిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షులు ఎం. చంటిబాబు, ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కన్వీనర్ నక్కెళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చల్లో పార్ట్ టైం ఉద్యోగులు గంట మాత్రమే పనిచేస్తారని చెప్పిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల చేత గోడ్డు చాకిరి చేయించుకుని ఇలా చులకనగా మాట్లాడటం మానుకోవాలన్నారు. కుక్కని తోక ఆడిస్తుందా, తోకని కుక్క ఆడిస్తుందా అన్న కేసీఆర్ 24 సీట్లలో ఉద్యోగులు ఓట్లతో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయారని జగన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 125 మున్సిపాలిటీలకు గాను 75 మున్సిపాలిటీలలో సమ్మె జరుగుతుంటే మంత్రి ఆదిమూలపు సురేష్ ఐదు శాతమే సమ్మె జరుగుతుందని పత్రికలలో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, పోటీ కార్మికులకి రోజుకి 2000 చెల్లించి పని చేయించడానికి సిద్ధపడిన జగన్ ప్రభుత్వం, సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులకి రోజుకి 1000 రూపాయలు జీతంకుడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. ఇంజనీరింగ్ కార్మికులకి హెల్త్ అలవెన్స్ ఇస్తామని ప్రకటించిన మంత్రి ఇప్పటివరకు జీవో ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. అంగన్వాడి సెంటర్లను విరామం లేకుండా నడపాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సచివాలయ ఉద్యోగుల చేత నడపడానికి సిద్ధపడ్డ జగన్ ప్రభుత్వం, అంగన్వాడీలకు గ్రాడ్యుటి ఇవ్వాలని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు అమలు చేయట్లేదని తిరిగి ప్రశ్నించారు. రైతులు పోరాటంతో మోడి చేతే క్షమాపణలు చెప్పించారని, ఉద్యోగులు, కార్మికులు పోరాడితే జగన్ ప్రభుత్వం కూడా దిగిరాక తప్పదని, లేకపోతే రాజకీయ భవిషత్తుని త్యాగంచేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

సుప్రీంకోర్టు తీర్పుప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనం 26వేలు చెల్లించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని జగన్ హామిమేరకు రెగ్యులర్ చేయాలని, అప్పటివరకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, 10లక్షల భీమా సౌకర్యం అమలు చేయాలని, 3వతేది జగన్ కి కనపడేలా కాకినాడలో ఫ్లెక్సులు ఏర్పాటుచేసి, ఆందోళన నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కె.ఎం.ఎం.ఆర్. ప్రసాద్, జిల్లా కార్యదర్శి వర్మ, కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజబాబు, 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రమణ, రాజబాబు, భాను, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమణి, జిల్లా అద్యక్షలు వరలక్ష్మి, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు త్రిమూర్తులు, శ్రీకాంత్, మున్సిపల్ జిల్లా నాయకులు, పెంక్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, జిల్లా కమిటీ సభ్యులు యు.ఎస్.ఎం.రెడ్డి, యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నాయకులు ఇబ్రహీం, ఎస్.ఎఫ్.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసూరిబాబు, విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం నాయకులు జోగా అప్పారావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నర్ల ఈశ్వరి, ఏపీ పంచాయితీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మెడిశెట్టి వెంకటరమణ, సమగ్రశిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనాగమణి, కోశాధికారి పి.రాజు, చరణ్, అంగన్వాడీ కాకినాడ నగర ప్రధాన కార్యదర్శి జ్యోతి, సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు కామేశ్వరి తదితరులు మద్దతుగా మాట్లాడారు.

➡️