ప్రలోభ పెట్టు.. ఓటు పట్టు..

May 8,2024 22:28
ప్రలోభ పెట్టు.. ఓటు పట్టు..

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. చివరకు అడ్డదారులు తొక్కయినా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. అందుకే ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఈ విషయంలో ప్రధానంగా వైసిపి ఒక అడుగు ముందే ఉందని ప్రచారం జరుగుతోంది.తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసిపి ఓటర్లను ఒత్తిడి చేసైనా ప్రలోభాల గురి చేసేందుకు సిద్ధంగా ఉంది. చేసి చూపిన అభివద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేయండని అడగాల్సిన అధికార పార్టీ అభ్యర్థులు మరోసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని లక్ష్యంతో ప్రలోభాలకు తెర లేపుతున్నారు. ఇప్పటికే బ్యాలెట్‌ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన అధికార పార్టీ ఇక సాధారణ ఓటర్లపై దష్టిని సారించింది. తునిలో మంత్రి దాడిశెట్టి రాజా అనుచరులు మహిళలకు చీరలు, కొంత నగదు పంపిణీ చేస్తున్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. కాకినాడ స్మార్ట్‌ సిటీలో ఇప్పటికే కొన్ని డివిజన్లలో ఓటుకు రూ.3 వేల చొప్పున బలవంతంగా ఓటర్లకు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాక కొన్ని నియోజకవర్గాల్లో వచ్చేది మళ్లీ తమ ప్రభుత్వమే అని ఓటుకు వేయకపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని అధికార పార్టీ నేతలు కొన్ని వర్గాలను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో కొంత గందరగోళం జరిగింది. ఉద్యోగులను అధికార పార్టీ అభ్యర్థుల అనుచరులు బెదిరించినట్లు కొన్నిచోట్ల ఆరోపణలు వచ్చాయి. ఇటు టిడిపి, జనసేన అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ ప్రచారం చేస్తున్న ఆ పార్టీల అభ్యర్థులు వర్గాలవారీగా పెద్దలను పిలిపించి వారిని ఒత్తిడికి గురి చేసి ఓట్లను వేయించుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఆయా సామాజిక వర్గాలకు చెందిన కుల పెద్దలకు పెద్ద ఎత్తున సొమ్ములు ఆశ చూపినట్లుగా ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తుండడంతో అధికార పార్టీ ఈ నియోజకవర్గంపై పూర్తి ఫోకస్‌ పెట్టింది. నియోజవర్గవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులకు కొంత నగదును ముట్ట జెప్పి నట్లుగా ఆరోపణలు విని పిస్తున్నాయి. ఎన్నికలకు మరో మూడు రోజులే సమయం ఉండడంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తరపున ఆయన అనుచరులు సైతం ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అన్ని మార్గాలనూ ఎంచుకున్నారు. అధికార పార్టీ నుంచి భారీగా చేరికలపై దష్టిని పెట్టిన కూటమి నేతలు పార్టీలోకి చేరిన వారికి పెద్ద ఎత్తున నగదును ముట్ట చెప్పినట్లుగా విమర్శలు అధికార వైసిపి నేతలు నుంచి వినిపిస్తున్నాయి. ఇటు రావులపాలెం అలమూరు, కొత్తపేట తదితర ప్రాంతాల్లో అధికార పార్టీ అభ్యర్థి అనుచరులు చీరలు, నగదును పంపిణీ చేస్తున్నారు. రాజానగరం నియోజకవర్గం జక్కంపూడి రాజా అనుచరులు సీతానగరంలో ఇంటి స్థలాలు ఇస్తామని కొంతమందికి స్థలాలు చూపించడం చర్చనీయాంశంగా మారింది.

➡️