‘మున్సిపల్’ సమ్మెకు సంఘీభావంగా క్లాప్ వాహన డ్రైవర్స్

Dec 31,2023 15:33 #Kakinada
muncipal strike

 

ప్రజాశక్తి-కాకినాడ : సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు సంఘీభావంగా కాకినాడ నగర పాలక సంస్థ క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) వాహన డ్రైవర్స్ ఆదివారం ఉదయం విధులకు హాజరయ్యే ముందు జగన్నాధపురం వాహన యార్డ్ వద్ద కొంతసేపు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని ఎన్నోసార్లు వినతి పత్రాలు, ఆందోళనలు చేపట్టిన తరువాత ప్రభుత్వ స్పందన లేకపోవడం వల్లనే సమ్మె జరుగుతుందన్నారు. క్లాప్ డ్రైవర్స్ కి ప్రభుత్వ జిఓ నెం 7 ప్రకారం 18,500 రూ‌. జీతం, వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవులు, కార్మిక చట్టాలు అమలు చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమ్మె డిమాండ్స్ పరిష్కారం చేయాలని, లేనిపక్షంలో కాకినాడ నగరంలో కార్మికులు చేపట్టబోయే సమ్మె లో క్లాప్ డ్రైవర్స్ కూడా భాగస్వాములు అవుతారని తెలిపారు. పట్టణ ప్రాంతాల ప్రజలంతా మున్సిపల్ కార్మికుల సమ్మె కు మద్దతు ఇవ్వాలని సిఐటియు కోరుతుందన్నారు.
సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ మాట్లాడుతూ క్లాప్ డ్రైవర్స్ యూనియన్ ని బలోపేతం చేసుకుని, సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలన్నారు.
ఈ కార్యక్రమంలో క్లాప్ వాహన డ్రైవర్స్ ఎం. శివ శంకర, ఎస్. సంతోష్, విక్టర్, ఇస్మాయిల్, రాజేష్, కొండబాబు, విజయ్ కుమార్, ప్రసాద్, రాము, గంగాధర్, సూరిబాబు, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

➡️