వైభవంగా ‘నెమలిగుండ్ల’ కల్యాణోత్సవం

ప్రజాశక్తి-రాచర్ల: రాచర్ల మండలం జే పుల్లలచెరువు గ్రామ సమీపాన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసివున్న చారిత్రకమైన నెమలిగుండ్ల రంగనాయక స్వామి కళ్యాణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంతం లచ్చమ్మ పేట దగ్గర గల స్వామివారి కల్యాణ మండపంలో కళ్యాణం జరిగింది. ఆలయ కార్యనిర్వ హణాధికారి బి రమేష్‌ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి దంపతులు కళ్యాణ కార్యక్రమంలో కూర్చుని కల్యాణోత్సవం జరిపించారు వీరితోపాటు అనేకమంది దంపతులు పాల్గొని స్వామివారి కళ్యాణం జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో భక్తుల స్వామి నామస్మరణాలతో అటవీ ప్రాంతం అంతా మారు మ్రోగిపోయింది. భక్తులు సంతోషంతో అనంద భరితులయ్యారు.ఆలయ ప్రాంతంలో ఉన్న ఆర్యవైశ్య, రెడ్లు, కాపు, బలిజ, యాదవ, బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ మొదలగు అన్న సత్రాలు వేలాదిమంది భక్తులకు అన్న దానం చేయగా, దేవదాయ శాఖ వారు భక్తులందరికీ మజ్జిగ ప్యాకెట్లు అందించారు. వైద్య ఆరోగ్యశాఖ వారు వచ్చిన భక్తులకు వైద్య సేవలు అందించారు.పోలీస్‌ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఏపీఎస్‌ఆర్టీసీ కంభం, గిద్దలూరు నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. మండుటెండలు సహితం లెక్కచేయక అనేక ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు భక్తులు వారి సేవల్ని కొనియాడారు.

➡️