హాస్టల్లో కనీస వసతుల కరువు

Jun 30,2024 22:57

విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకుంటున్న సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-అమలాపురం అమలాపురం కొంకాపల్లి నందు గల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర హాస్టల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అన్నారు. అమలాపురం సంక్షేమ హాస్టళ్ల పర్యటనలో భాగంగా ఆదివారం కొంకాపల్లిలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర హాస్టల్‌ను సిపిఎం నాయకులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు హాస్టల్‌ను పరిశీలించారు. అనంతరం పలు అంశాలు పాత్రికేయులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పాత భవనంలో కొంకాపల్లి సాంఘిక సంక్షేమ హాస్టల్‌ నిర్వహిస్తున్నారని అన్నారు. కనీస వసతులు ఈ హాస్టల్‌ నందు లేవని విద్యార్థులు వాపోయారని తెలిపారు. అలాగే హాస్టల్లో విపరీతమైన దోమలు ఉన్నాయని వాటిని నియంత్రించలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. కిటికీలకు మెస్‌లు కూడా లేవని విద్యార్థులు వాపోయారని తెలిపారు. అలాగే బాత్రూమ్‌డోర్‌ లేదని పాత భవనం కావడంతో దీన్ని మరమ్మతులు ఇంటి యజమాని చేయడం లేదన్నారు. సౌకర్యాలు లేక హాస్టల్‌ విద్యార్థులు అవస్థలుపడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే సొంత భవనాన్ని నిర్మించాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేయాలని టాయిలెట్స్‌ ఇతర సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న హాస్టల్లో నిర్వహణకు సంబంధించిన నిధులు తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. గత అనేక సంవత్సరాలుగా ఈ హాస్టల్‌ని నూతన భవనం సొంత భవనాన్ని నిర్మించాలని కోరుతున్నప్పటికీ ఏళ్ల తరబడి పాత భవనంలో నిర్వహిస్తున్నారని దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఈ సందర్భంగా తెలిపారు. తక్షణం ప్రభుత్వ ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టి హాస్టల్‌ నూతన భవన నిర్మాణానికి కృషి చేయాలన్నారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలిపారు. ఈ పర్యటంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ కె.శంకర్‌, నాయకులు పొలమూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️