సుభాష్ కక్ష సాధింపు ప్రకటనలు మానుకోవాలి

Jun 12,2024 12:13 #Konaseema

 సిఐటియు డిమాండ్

ప్రజాశక్తి-రామచంద్రపురం : రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఎంపికైన వాసంశెట్టి సుభాష్ కక్ష సాధింపు చర్యలు ప్రకటనలు మానుకోవాలని సిఐటియు యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్మికులపై సుభాష్ కక్ష సాధింపు ప్రకటనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వాలoటీర్ లన్ అందర్నీ కొనసాగిస్తామని ప్రకటించారని ఆ మాట నిలబెట్టుకోవాలనీ చెప్పుడు మాటలు విని కార్మికుల పట్ల కక్ష సాధింపు ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలని సిఐటియు అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి నూకల బలరాం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ కి సిఐటియు కార్మిక సంఘం తరుపున ఆయన శుభాకాంక్షలు తెలియచేశారు. సుభాష్ విడుదల చేసిన ఒక వీడియోలో కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లను, వైయస్సార్ వాలంటీర్లను, తొలగిస్తామని వీడియో రిలీజ్ చేయడాన్ని సిఐటియు తరపున ఖండిస్తున్నాం అని అన్నారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు ఎవరిని తొలగించమని వారికి మేం అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఎమ్మెల్యే వీడియోలో వీళ్ళందర్నీ తొలగించాలని అనటం సరైనది కాదని అన్నారు. చిరు ఉద్యోగుల మీద కక్ష సాధింపు చర్యలు అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించడం వంటిదని తెలిపారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రి వేణుగోపాల్ కూడా పక్కనున్న చోటా నాయకుల మాటలు విని కక్ష సాధింపు చర్య చేయాలనుకుంటే సరైన గుణపాఠం చెప్పామని తెలియజేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అందర్నీ తనవారిగానే చూసుకోవాలని ఎవరికి కష్టమొచ్చినా అండగా నిలవాలని సూచించారు. పక్కనున్న వారి చెప్పుడు మాటలు వినకుండా నిజనిర్ధారణలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల జోలికొస్తే సిఐటియు సంఘ చూస్తూ ఊరుకోదని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా సిఐటియు అనుబంధ సంఘం సభ్యులేనని వీరిని తొలగింపులు చేయాలన్న సంఘం చూస్తూ ఊరుకోదని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధి తమ వైఖరి మార్చుకుని ప్రజలందరూ మెచ్చుకునే పరిపాలనను అందించాలని బలరాం కోరారు.

➡️