ఎర్రజెండాకు చట్ట సభల్లో అవకాశమివ్వండి

Apr 17,2024 23:26
  • సిపిఎం గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-గన్నవరం

రానున్న ఎన్నికల్లో ఎర్రజెండాకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు కోరారు. బుధవారం గన్నవరం మండలంలోని బూతిమిల్లిపాడు, బుద్దవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను, మద్యం వల్ల కలిగే నష్టాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వీధికి మద్యం షాపులు వచ్చాయి కానీ ఈ సంవత్సరం వచ్చిన నీటి ఎద్దడి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజాసమస్యలపై ఎర్రజెండా నిరంతరం పోరాడుతుందన్నారు. సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటు వేసి సిపిఎంకు మద్దతు పలకాలని కోరారు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్న బిజెపి దాని మద్దతు పార్టీలైన టిడిపి, వైసిపిలను ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గన్నవరం మండల కమిటీ సభ్యులు బడుగు మరిదాసు, గన్నవరం మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు, మండల కమిటీ సభ్యులు మీరా ఖాన్‌, నాయకులు అరుణ్‌, కరిముల్లా, షేక్‌ బాజీ, వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️