ముఖ్యమంత్రి జగన్‌ ఆర్థిక నేరస్తుడు

Jan 13,2024 19:51

మాట్లాడుతున్న బీవీ.జయ నాగేశ్వర రెడ్డి

– టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బీవీ
ప్రజాశక్తి – ఎమ్మిగనూరు
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆర్థిక నేరస్తుడని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జగన్మోహన్‌ రెడ్డి తీరును, పెత్తందారి పోకడలను వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలే బహిరంగంగా చెబుతున్నారని తెలిపారు. జగన్‌ జేబు సంస్థ సిఐడిని అడ్డం పెట్టుకుని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపు చర్యలతో పాటు నీలి మీడియాలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ రెడ్డిపై ఇప్పటికే 38 కేసులు ఉన్నాయని, రూ.43 వేల కోట్ల దోపిడిపై సిబిఐ, ఈడీ ఛార్జీషీట్లు కూడా వేసిందని తెలిపారు. ఈ కేసుల్లో ఇప్పటికి 3,500 సార్లు వాయిదా తీసుకున్న ఏకైక ఆర్థిక నేరస్తుడు జగన్‌ రెడ్డి అని ఎద్దేవా చేశారు. 2004లో అప్పుల వల్ల హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్‌ రెడ్డి 19 ఏళ్లలో రూ.4 లక్షల కోట్లు ప్రజా సంపదను కొల్లగొట్టారని తెలిపారు. జగన్‌ పాలనలో చంద్రబాబుపై 13 అక్రమ కేసులు పెట్టి ఏ కేసుకూ ఆధారాలు చూపలేదన్నారు. జగన్‌ రెడ్డి కేసులపై సాక్షాత్తు జడ్జీలే కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భాలు అనేకమని తెలిపారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసి, అక్రమంగా కేసులు పెట్టినా టిడిపి భయపడదని, రానున్న రోజుల్లో జగన్‌ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజలు జగన్‌ రెడ్డి అక్రమాలను, అన్యాయాలను, అవినీతి పాలనను గమనిస్తూనే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.

➡️