విరుపాక్షిని వరించిన వైసిపి టిక్కెట్‌…

Jan 13,2024 19:46

జడ్‌పిటిసి విరుపాక్షి

– అంచెలంచెలుగా ఎదిగిన రాజకీయ ప్రస్థానం…
– గ్రామాల్లో కార్యకర్తల సంబరాలు..
ప్రజాశక్తి-ఆలూరు
చిప్పగిరి జడ్‌పిటిసి విరుపాక్షికి ఆలూరు వైసిపి టిక్కెట్‌ ఇస్తున్నట్లు అధిష్టానం ప్రకటించడంతో వైసిపి ఆలూరు అసెంబ్లీ సీటుపై 15 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆలూరు అసెంబ్లీ టిక్కెట్‌ విషయంలో మంత్రి జయరామ్‌, హిమవర్షరెడ్డి, కప్పట్రాళ్ల బొజ్జమ్మ, చిప్పగిరి జడ్‌పిటిసి విరుపాక్షి మధ్య అధిష్టానం వద్ద జోరుగా చర్చ జరిగినట్లు తెలిసింది. విరుపాక్షికి సీటు (ఆలూరు వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ) కేటాయిస్తూ అధికారికంగా ప్రకటన వెలువడడంతో నియోజకవర్గంలో విరుపాక్షి గ్రూపు సంబరాలు చేసుకుంది.
విరుపాక్షి రాజకీయ ప్రస్థానం
అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యే బరిలో నిలిచేవరకు కొనసాగింది. 1969వ సంవత్సరం మార్చి నెల 4న శ్రీదేవమ్మ, చిన్న ఆంజనేయులుకు విరుపాక్షి జన్మించారు. ఇంటి పెద్ద కుమారునిగా రైల్వే కాంట్రాక్టు పనులు చేసుకుంటూ రాజకీయాలపై ఉన్న ఆసక్తితో కాంగ్రెస్‌లో చురుకుగా పాల్గొనేవారు. జిల్లాలో అనేక మంది రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. కీర్తిశేషులు వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి మరణానంతరం ఆయన తనయుడు వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి పార్టీలో చేరారు. మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు సన్నిహితుడుగా వైసిపి పార్టీలో పని చేశారు. 2019 ఎన్నికల్లో మంత్రి గెలుపునకు తనవంతు తోడ్పాటునందించారు. మంత్రి కూడా విరుపాక్షికి ఉన్న ప్రజాదరణ చూసి జడ్‌పిటిసి టిక్కెట్‌ కేటాయించారు. ఆ ఎన్నికల్లో జడ్‌పిటిసిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలిచిన కొన్నిరోజులకే మంత్రి సోదరులకు, విరుపాక్షికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. విరుపాక్షి కూడా మంత్రికి దూరంగా ఉంటూ సొంతగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేవారు. నియోజకవర్గంలో శుభకార్యాలకు, ఆపదలకు, గ్రామాల అభివృద్ధికి ఎవరు పిలిచినా, తెలిసినా హాజరై ఆప్యాయంగా పలుకరిస్తూ, కోరిన వారికి కాదనకుండా తనవంతు ఆర్థిక సహాయ, సహకారాలు అందించడంతో ప్రజాదరణ పొందారు. ప్రజాదరణే ఎమ్మెల్యే టిక్కెట్‌ రావడానికి దోహద పడిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
వైసిపి ఆలూరు ఇన్‌ఛార్జీ, ఉమ్మడి జిల్లా పంచాయతీ రాజ్‌ వింగ్‌ అధ్యక్షులు, చిప్పగిరి జడ్‌పిటిసి బి.విరుపాక్షి ప్రొఫైల్‌
పూర్తి పేరు : బుసినే విరుపాక్షి
తల్లి : శ్రీదేవమ్మ
తండ్రి : చిన్న ఆంజనేయులు
భార్య : రామాంజినమ్మ
కొడుకులు : లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్‌
చదువు : 10వ తరగతి
పుట్టినతేది : 04-03-1969

➡️