ఇండియా వేదికను గెలిపించుకుందాం

ప్రజాశక్తి-చీరాల: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్‌ పిలుపునిచ్చారు. సోమవారం చీరాలలోని కొత్తపేట ప్రైవేట్‌ గెస్ట్‌ హౌస్‌లో దళిత మహాసభ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరై మాట్లాడారు. రాజ్యాంగాన్ని మారుస్తానంటున్న బీజీపీని ఓడించాలన్నారు. మోడీ ప్రధానిగా వచ్చాక, దేశంలో నియంతృత్వం పెరిగిందన్నారు. అంబేద్కర్‌ తగలబెట్టిన మనుస్మతిని మళ్లీ తీసుకు రావాలనేది ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అన్నారు. ఆంధ్రప్రదేశ్లో బిజెపి తెలుగుదేశం పార్టీతో సంసారం, వైసిపితో సహజీవనం చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌, మోడీ అనుకున్నట్టుగా ఎన్డీఏ కూటమి 400 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే, రాజ్యాంగాన్ని మారుస్తారన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగం మారిపోతే, ఎస్సీ, ఎస్టీ, బీసీల బతుకులు దుర్భరమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులర్‌ భావాలు కలిగిన ఇండియా వేదిక ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలని నీలం నాగేంద్ర, మాచవరపు జూలియన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు గొర్రెముచ్చు రాంబాబు, దిలీప్‌ కుమార్‌, జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️