సుందరయ్య ఆశయాలు కొనసాగిద్దాం

ప్రజాశక్తి-మదనపల్లి భారత కమ్యునిస్టు ఉద్యమ నిర్మాత, కార్మిక, కర్షక, పేదప్రజల ఆశాజ్యోతి, మహోన్నతమైన వ్యక్తిత్వం, నిజాయతీ, నిబద్ధత, క్రమశిక్షణకు నిలువుటద్దం, భారతదేశ రాజకీయాలలో మచ్చలేని మహా నాయకుడిగా పేరు పొందిన నాయకుడు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర యోధుడు, అసమానతను, వివక్షను చిన్ననాడే ఎదిరించినవారు సుందరయ్య అని కొనియాడారు. భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లొ అగ్రగన్యుడు, వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సారధ్యం వహించి లక్షల ఎకరాల భూమిని పెదాలకు పంపిణీ చేసిన వీరుడుగా అభివర్ణించారు. అతివాద, మితవాద ధోరణిని ఎదిరించి సిపిఎం అఖిల భారత వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కార్మికవర్గ చైతన్యంతో ఉన్న పార్టీని నిర్మించారని తెలిపారు. సైకిల్‌ పై పార్లమెంటుకు వెళ్ళిన నేత, కమ్యూనిస్టు గాంధీగా పేరుగాంచినవారని అన్నారు. యావదాస్తిని ప్రజా ఉద్యమాలకు, పార్టీకి ఇచ్చేసిన పీడిత ప్రజల ప్రియతమనేత సుందరయ్య కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రమణరావు, నాగరాజు, రమణ, సిఐటియు నాయకులు నారాయణ, ఖదిర్‌, ప్రముఖ న్యాయవాది సోమశేఖర్‌ పాల్గొన్నారు.అరుదైన నేత పుచ్చలపల్లి సుందరయ్య : సిఐటియు రాజంపేట అర్బన్‌ : రాజకీయ నాయకులలో పుచ్చలపల్లి సుందరయ్య అరుదైన నేత అని సిఐటియు జిల్లా కార్యదర్శి చిట్వేలి రవికుమార్‌ అన్నారు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆదివారం ఐసిడిఎస్‌, సిఐటియు నేతలు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టు గాంధీగా సుందరయ్య తెలుగు నాట ప్రముఖుడని అన్నారు. కుల వ్యవస్థను నిరసించిన ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి అని, తన పేరులోని రెడ్డి అనే కుల సూచికను తొలగించుకున్నారని తెలిపారు. సంవత్సరాలు కామ్రేడ్‌ పిఎస్‌ అని పిలిచేవారని, ఆయన నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపారని వివరించారు. స్వాతంత్ర సమరంలోని అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని, ఆయన సతీమణి సైతం సిపిఐ-ఎం లోని ముఖ్య నాయకురాలని తెలిపారు. తెలంగాణ ప్రజల పోరాటం-దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశారని అన్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేశారని, ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్‌ మీద వెళ్లేవారని తెలిపారు. నాటి, నేటి రాజకీయ నేతలకు ఆదర్శమూర్తి అని కొనియాడారు. కార్యక్రమంలో సిఐటియు అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, ప్రాజెక్టు నాయకులు ఈశ్వరమ్మ, అమరావతి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి, మున్సిపల్‌ వర్కర్స్‌,హెల్పర్స్‌ యూని యన్‌ నాయకులు లక్ష్మీదేవి, ప్రసాద్‌, రమణ, సురేష్‌, సాయి పాల్గొన్నారు. రాయచోటి టౌన్‌ : పుచ్చల పల్లి సుందరయ్య 39 వ వర్ధంతి సందర్బంగా ప్రభుత్వ ఆస్పత్రిలో సిపిఎం, సిఐటియు నాయకులు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.వి.రమణ, డి భాగ్యలక్ష్మి సిపియం నాయకులు మాధవయ్యలు మాట్లాడుతూ నిజాయతీకి మారుపేరుగా ఉదహరించే మహానాయకులలో సుందరయ్య ఒకరని అన్నారు. 1913లో నెల్లూరు జిల్లా అలగానిపాడులో జన్మించారని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలో చేరి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి పేదలకు వేలాది ఎకరాల భూపంపిణీ చేశారని చెప్పారు. ప్రజాసేవకు నిబద్ధుడై పిల్లల్ని సైతం కనలేదని చట్టసభలకు కూడా సైకిల్‌పై వెళ్లిన నిరాడంబరుడిగా, నిస్వార్థంగా ప్రజాసేవ చేసి చరిత్ర పుటల్లో నిలిచారని కొనియాడారు. కార్యక్ర మంలో సిఐటియు నాయకులు ఆదిలక్ష్మి, సులోచన, అంజి, హర్ష, చెన్నయ్య, అంజి, బాలాజీ పాల్గొన్నారు. పీలేరు: సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రామయ్య ఆధ్వర్యంలో హమాలీలు, కూలీలు సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక రాజకీయాల్లో విలువలు పాటించే సుందరయ్య వంటి నాయకులు అరుదుగా ఉంటారని తెలిపారు. ఆయన సహచరులు తనని ‘కామ్రేడ్‌ పిఎస్‌’అని పిలిచేవారని, ఆయన నిరాడంబర మైన ఆదర్శమయ జీవితం గడిపారన్నారు. స్వాతంత్య్ర సమరంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. సుందరయ్య సతీమణి కూడా సిపిఐ-ఎంలో ముఖ్య నాయకురాలుగా వ్యవహరిస్తూ, తెలంగాణ ప్రజల పోరాట పాఠాలను విశాలాంధ్ర, ప్రజారాజ్యం పుస్తకాల్లో నివేదికలు రాశారని అన్నారు. కార్యక్రమంలో పురుషోత్తమ, నాగరాజ, బాష, వైఎస్‌ మస్తాన్‌, రవణమ్మ, కార్మికులు పాల్గొన్నారు.గాలివీడు : స్థానిక బస్టాండ్‌ ఆవరణంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఓబులమ్మ, లక్ష్మీదేవి, భోగేశ్వరయ్య, సరస్వతి, నీలమ్మ పాల్గొన్నారు. రైల్వేకోడూరు : పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.మణి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ చంద్రశేఖర్‌,సిఐటియు, మండల సహాయ కార్యదర్శి, ముత్యాల శ్రీనివాసులు, నగిరిపాటి ఆనంద్‌, మంగంపేట మైనింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ త్రివేణి నాయకులు, శివ, సిఐటియు, ఓబులవారిపల్లె, మండల కార్యదర్శి, నాగిపోగు పెంచలయ్య, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఓబులవారిపల్లి మండల కన్వీనర్‌, హరి ప్రసాద్‌ సిఐటియు పెనగలూరు మండల కార్యదర్శి మధ్యలో ప్రసాద్‌, సహాయ కార్యదర్శి, సి నందకుమార్‌, కోడూరు, వ్యవసాయ కార్మిక సంఘం, మండల నాయకులు, బొజ్జ శివయ్య, కోడూరు సిఐటియు మండల నాయకులు చలపతి, సుబ్బరాయుడు పాల్గొన్నారు.

➡️