ఫోన్‌పే చేస్తేనే మద్యం!

ప్రభుత్వ వైన్‌ షాపులు

కొత్త నిబంధనతో గందరగోళం

వైన్‌షాపుల దగ్గర మందుబాబుల గగ్గోలు

ప్రజాశక్తి -గోపాలపట్నం : ప్రభుత్వ వైన్‌ షాపులు వద్ద మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. ఇన్నాళ్లు డబ్బులు ఇస్తేనే మద్యం విక్రయించే విధానానికి శుక్రవారం నుంచి ప్రభుత్వం చరమగీతం పలికింది. తాజాగా ఫోన్‌పే చేస్తేనే మద్యం ఇస్తామని వైన్‌షాప్‌ నిర్వాహకులు చెప్పడంతో మందుబాబుల్లో గందరగోళం ఏర్పడింది. చాలామంది మందుబాబులకు స్మార్ట్‌ఫోన్లు, వాటిల్లో ఫోన్‌పే సౌకర్యం లేదు. దీంతో వారికి ప్రభుత్వం మద్యం దుకాణాల్లో మందు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఎప్పటిలాగానే తాము డబ్బులు ఇస్తే మద్యం ఇవ్వకపోవడంతో వైన్‌షాపుల్లోని సిబ్బందితో మందుబాబులు వాగ్వివాదానికి దిగుతున్నారు. సాయంకాలం పని పూర్తి చేసుకుని, శరీర కష్టం నుంచి ఉపశమనానికి మద్యం తాగే అలవాటున్న వారంతా, క్వార్టర్‌ మందు కోసం క్యూలైన్‌లో నిలబడితే, లేనిపోని నిబంధనలు పెట్టి మందు లేదనేసరికి వారంతా చిర్రెత్తిపోతున్నారు. ఫోన్‌పే కొట్టు, మద్యం బాటిల్‌ పట్టు అంటూ కొత్త విధానాన్ని మద్యం దుకాణాలు సిబ్బంది చెప్పేసరికి మొదట్లో ఖంగుతిన్న మందుబాబులు, తర్వాత ఎక్కడలేని కోపాన్ని తెచ్చి చిందులేస్తున్నారు. అయితే తామేమీ చేయలేమని, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఫోన్‌పే చేస్తేనే మందు ఇస్తామని లేకుంటే లేదని చేతులెత్తేయడంతో వైన్‌ షాపుల దగ్గర మందుబాబులు గగ్గోలు పెట్టారు.మద్యం అలవాటు ఉండి, ఫోన్‌పే సదుపాయం లేని వారంతా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. మొత్తానికి శనివారం నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన మద్యం అమ్మకాల విధానంతో మందుబాబులకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి ఉంది.

➡️