పెట్టుబడి సాయానికి ఎదురు చూపులు

Jun 29,2024 20:32

ఖరీఫ్‌కు ‘పెట్టుబడి’ అందేనా?

రూ.20 వేలు పెట్టుబడి అందిస్తామన్న టిడిపి ప్రభుత్వం

బాసటగా నిలుస్తుందని రైతుల ఆశ

ప్రజాశక్తి – జామి :  ఆరుగాలం కష్టించినా… అక్కరకు రావడం లేదన్న అన్నదాత ఆవేదనకు ఈ ప్రభుత్వంలోనైనా అడ్డుకట్ట పడుతుందా..? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. వర్షాలు అనుకూలిస్తే మరో వారం, పది రోజుల్లో ఖరీఫ్‌ సాగుకు అన్నదాత సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో నిమగమయ్యాడు. కానీ ఇంతవరకు రైతన్న చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీ అమలు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా రైతు పెట్టుబడి నిధి కోసం ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తామని చెప్పిన మాట విదితమే. అందులో భాగంగానే ఖరీఫ్‌కు సాయం అందుతుందని రైతులు భావిస్తున్నారు. అదే జరిగితే, ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు తాపీగా సాగుతుందని రైతులు అంటున్నారు. జిల్లాలో చిన్న, సన్నకారు రైతాంగమే అత్యధికం. గతంలో ఖరీఫ్‌ సాగును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందజేసి, పంట సాగుకు సాయపడేవి. కానీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కలుపుకుని ఏడాదికి రూ.13,500 రైతు ఖాతాల్లో విడతల వారీగా జమ చేసింది. ఇలా అధికారం చేపట్టిన మొదటి ఏడాది 2019-20లో జిల్లాలో 2,03,451 మంది రైతులకు రూ.274.65 కోట్లు రైతుభరోసా కింద అందించిన ప్రభుత్వం… గతేడాది 2,63,414 మంది రైతులకు రూ.355.30 కోట్ల వరకూ అందజేసింది. గత ఐదేళ్లలో జిల్లా రైతాంగానికి వైసిపి ప్రభుత్వం రూ.1,629.35 కోట్లు అందజేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడి, కొద్ది కాలమే అయినా, ఖరీఫ్‌ సాగు రానే వచ్చింది. ఈ నేపథ్యంలోనే సూపర్‌ సిక్స్‌ పథకాల్లో రైతు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని రైతులు ఎదురు చూస్తున్నారు.బాసట దొరికేనా? నూతన ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో ఖరీఫ్‌ సాగుపై సమీక్ష జరపాలని రైతులు ఆశిస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు తగిన నిల్వలు చేసుకోవాల్సిన నేపథ్యంలో వెనువెంటనే ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించి, పెట్టుబడి సాయంలో భాగంగా ఖరీఫ్‌ సాగుకు కొంత సాయమైనా అందించాలని కోరుతున్నారు. అదే జరిగితే, చిన్న, సన్నకారు రైతులకు కొంత బాసట ఉంటుందని భావిస్తున్నారు.కౌలుదారుకు సాయం? జిల్లాలో వేలాది మంది కౌలురైతులు సాగు చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వాలు కౌలురైతుల గుర్తింపు విషయంలోనూ తాత్సరం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా కౌలురైతుకు పెట్టుబడి సాయం కింద ప్రకటించిన రూ.20 వేలు అందేలా కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలని కౌలుదార్లు కోరుతున్నారు. అప్పుడే జిల్లాల్లో అన్నదాతకు నిజమైన పెట్టుబడి సాయం అందుతుందని రైతు సంఘాల నాయకులు, రైతులు భావిస్తున్నారు.

➡️