టెన్త్‌ ఫలితాల్లో మన్యం జిల్లా ఫస్ట్‌

Apr 22,2024 22:28

96.37 శాతం ఉత్తీర్ణత

91.82 శాతంతో విజయనగరం జిల్లాకు 5 వ స్థానం

ఉమ్మడి జిల్లాలో 235 పాఠశాలల్లో నూరుశాతం ఫలితాలు

బాలికలదే పైచేయి

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌/విజయనగరం టౌన్‌ :   పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విజయనగరం ఉమ్మడి జిల్లాలో బాలికలే పైచేయిగా నిలిచారు. పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లా 91.82శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానం సాధించింది. పార్వతీపురం మన్యంలో 96 పాఠశాలలు, విజయనగరం జిల్లాలో 139 ప్రభుత్వ పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. పార్వతీపురం మన్యం జిల్లా గత ఏడాది కూడా 87.47 శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. తాజాగా జిల్లాలో 210 పాఠశాలలకు గాను 96 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ ఏడాది జిల్లాలో 10443మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 10064 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 4861 మంది బాలురు, 5203 మంది బాలికలు ఉన్నారు. 8955 మంది విద్యార్థులు ప్రథమ స్థానంలోను, 854 మంది ద్వితీయ స్థానంలోనూ, 255 మంది తతీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురంలోని టిఆర్‌ఎం మున్సిపల్‌ పాఠశాల విద్యార్థి కెవి గౌతమి 591 మార్కులతో జిల్లాలో టాపర్‌గా నిలిచింది. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జిల్లాను నిలిపిన విద్యాశాధికారి జి.పడగాలమ్మను, ఉపాధ్యాయులను కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ కలెక్టరేట్‌లో కేక్‌ కట్‌ చేసి అభినందనలు తెలిపారు. తనకు మొదటి ర్యాంక్‌ వచ్చినంత ఆనందంగా ఉందని, ఈ ఫలితాలు గొప్ప సంతృప్తినిచ్చాయని పేర్కొన్నారు. ఇంతటి ఘనవిజయానికి కారకులైన జిల్లా ఉన్నతా అధికారులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బందికి, తల్లిదండ్రులకు డిఇఒ కృతజ్ఞతలు తెలిపారు. ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం మే 24 నుంచి జూన్‌ 3 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, సంబంధిత పాఠశాలలో ఈనెల 23 నుండి 30 వరకూ ఫీజులు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. విజయనగరం జిల్లా గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. గత ఏడాది 76.66 శాతం ఫలితాలతో రాష్ట్రంలో 7 వ స్థానంలో నిలవగా ఈ ఏడాది ఐదోస్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 23,690 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 21752 మంది ఉత్తీర్ణులై 91.72 శాతం ఫలితాలు సాధించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సరాసరి 15 శాతం ఫలితాలు శాతం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం పరీక్ష రాసిన విద్యార్థుల్లో బాలురు 11868 మందికిగాను 10671 మంది ఉత్తీర్ణులై 89.91 శాతం ఫలితాలు సాధించారు. బాలికలు మొత్తం 11822 మంది హాజరు కాగా వారిలో11081 మంది ఉత్తీర్ణులై 93.73 శాతం ఫలితాలు సాధించారు.139 పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు జిల్లాలో 139 స్కూళ్లు 100 శాతం ఫలితాలు సాధించాయి. వాటిలో ఎపి మోడల్‌ స్కూల్స్‌ 6, ఎపి గురుకులాలు 2,సాంఘిక సంక్షేమ గురుకులాలు 2, బిసి గురుకులాలు 5, కెజిబివి 11, జెడ్‌పిహైస్కూల్స్‌ 32, ప్రైవేటు స్కూల్స్‌ 78, గిరిజన గురుకులాలు 3 ఉన్నాయి.

‘ప్రయివేటు’కు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు

ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. విజయనగరం జిల్లాలో మోడల్‌ స్కూళ్లకు చెందిన చెందిన నలుగురు విద్యార్దులు 590 మార్కులు దాటి సాధించడం గమనార్హం. జిల్లాలో 13 ఎపి మోడల్‌ స్కూల్స్‌ నుంచి 1185 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 1170 మంది ఉత్తీర్ణులై 98.73 శాతం ఫలితాలు సాధించారు. 3 ఎపి రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నుంచి 194 మంది హాజరు కాగా 192 మంది ఉత్తీర్ణులై 98.97 శాతం నమోదు చేశారు. 8 సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు నుంచి692 మంది హాజరు కాగా వారిలో 565 మంది ఉత్తీర్ణులై 94.52 శాతం సాధించారు .6 బిసి గురుకులాల నుంచి 405 మంది హాజరు కాగా వారిలో 403 ఉత్తీర్ణులై 99.51 శాతం ఫలితాలు సాధించారు. 26 కెజిబివి పాఠశాలల నుంచి 1024 మందికి 986 మంది ఉత్తీర్ణులై 96.29 శాతం ఫలితాలు సాధించారు. 214 జెడ్‌పి హైస్కూళ్ల నుంచి 12,444 మంది పరీక్షకు హాజరు కాగా 11,113 మంది ఉత్తీర్ణులై 89.30 శాతం ఫలితాలు సాధించారు. 5 మున్సిపల్‌ హైస్కూల్‌ నుంచి 773 మందికి 560మంది ఉత్తీర్ణులయ్యారు. 132 ప్రైవేటు పాఠశాలల నుంచి 5982 మందికి 5861మంది ఉత్తీర్ణులయ్యారు. ఒక ఎయిడెడ్‌ పాఠశాల నుంచి 120 మంది హాజరు కాగా 102మంది ఉత్తీర్ణులయ్యారు.ఆరుగురు విద్యార్థులకు 590పైగా మార్కులుఆరుగురు మోడల్‌స్కూలు, ఎపి రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ విద్యార్థులు 590కుపైగా మార్కులు సాధించారు. సతివాడ మోడల్‌ స్కూల్‌ విద్యార్థి ఈశ్వర్‌ కార్తీక్‌ 594 మార్కులు సాధించాడు. కొత్తవలస మోడల్‌ స్కూల్‌ విద్యార్ది మారోతు హేమ వర్షిణి 592, ఎపి రెసిడెన్షియల్‌ బొబ్బిలి నుంచి కొట్టాపు వరుణ్‌ 592, మజ్జి హర్షవర్ధన్‌ 591, కర్రోతు .రాకేష్‌ 590, లగుడు జితిన్‌ సాయి 588, సతివాడ మోడల్‌ స్కూల్‌ విద్యార్థి కొంకి జాహ్నవి 592, మీసాల తేజేశ్వని 591, బొప్పడాం జెడ్‌పి హైస్కూల్‌ చెవూరు దుర్గా దిశిత 581, బిసి సంక్షేమ శాఖ నరవ హై స్కూల్‌ గోపిసెట్టి తరుణ్‌ 589, ఎపి మోడల్‌ స్కూల్‌ గర్భాం గుడివాడ సరస్వతి 589, జెడ్‌పి హై స్కూల్‌ బొండపల్లి పూడియామిని 589, కుమారాం జెడ్‌పి హైస్కూలు విజ్జపు యస్విత 589, ఎపి మోడల్‌ స్కూల్‌ భోగాపురం లెంక భావన 588, ఎపి మోడల్‌ స్కూల్‌ మరుపల్లి విద్యార్థి ఇమంది తపస్వినీ 588 మార్కులు సాధించింది.

➡️