కిశోర్‌ రాజీమానాతో ఉలిక్కిపడ్డ తెలుగు తమ్ముళ్లు

Feb 15,2024 20:04

గుమ్మలక్ష్మీపురం: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ మాజీ మంత్రి, టిడిపి నాయకులు కిషోర్‌ చంద్రదేవ్‌ రాజీనామా చేయడంతో కురుపాం నియోజకవర్గంలో టిడిపికి షాక్‌ తగిలింది. ఇటు కిషోర్‌ దేవ్‌, అటు శత్రుచర్ల విజయరామరాజు సహకారంతో టిక్కెట్‌ కోసం పోటీపడుతున్న ఆశావాహులు, నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత నాలుగేళ్లుగా మొదటి నుంచి కురుపాం నియోజకవర్గంలో టిడిపి రాజకీయ పరిస్థితులు రోజుకోలా మలుపులు తిరుగుతున్నాయి. ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పిన నాటి నుంచి 25 నెలలుగా తోయక జగదీశ్వరి పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. టిడిపికి పెద్ద దిక్కుగా ఉన్న విజయరామరాజు ఆశీస్సులు, కిషోర్‌చంద్రదేవ్‌ సహకారంతో ప్రతి గ్రామానికి వెళ్లి టిడిపికి పూర్వ వైభవం తీసుకొచ్చారు. జగదీశ్వరీకి ఇన్చార్జి పదవి ఇవ్వడం ఇష్టం లేని, రాజుల పాలన అవసరం లేదని కొంతమంది గిరిజన ఆశావాహులు రెండో గ్రూపుగా విడిపోయి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ దత్తి లక్ష్మణరావు సహకారంతో పార్టీ కార్యక్రమాలను పోటాపోటీగా నిర్వహించి టిడిపిలో తమ సత్తా ఏమిటో చూపించారు. అయితే పోటాపోటీగా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి తమ వర్గానికి వ్యతిరేకంగా దత్తి లక్ష్మణరావు గ్రూపు సభ్యులు చేస్తున్న కార్యక్రమాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టానం స్పందించి కొన్నాళ్లపాటు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, లేదంటే ఇన్చార్జితో కలిసి పని చేయాలని సూచించింది. దీంతో రెండో గ్రూపు ఆశావాహులు సైలెంట్‌ అయ్యారు. అయితే ఇదే తరుణంలో కురుపాం కోటకు చెందిన మాజీ ఎంపి ప్రదీప్‌దేవ్‌ కుమారుడు వైరిచర్ల వీరేశ్‌దేవ్‌ టిడిపి తెరపైకి వచ్చారు. దీంతో ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. కురుపాం టికెట్‌ ఎవరికి కేటాయిస్తారనేది చర్చ జరుగుతుంది. అయితే టిడిపి జనసేన పొత్తు ఖరారైనప్పటికీ మరోవైపు టిడిపి బిజెపితో జతకట్టడంతో మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు కూడా టికెట్‌ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కురుపాం టికెట్‌ టిడిపికా, జనసేనకా, లేదా బిజెపికా అనే చర్చ నడుస్తుంది. కురుపాంలో టిడిపికి బలం ఉన్నా గ్రూపు రాజకీయాల కారణంగా అది కనిపించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కిషోర్‌ చంద్రదేవ్‌ రాజీనామాతో టిడిపికి మరింత దెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా గ్రూపులను వీడి కలిసికట్టుగా పని చేస్తేనే టికెట్‌ ఎవరికి ఇచ్చినా విజయం ఖాయమవుతుందని, లేకుంటే లేదంటే ముచ్చటగా మూడోసారి కూడా వైసిపి గెలుపు సునాయాసనం అవుతుందనే చర్చ వినిపిస్తోంది.

➡️