గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి : డిఐఒ

Dec 12,2023 22:11

 గుమ్మలక్ష్మీపురం : మారుమూల గిరిశిఖర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని తాడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగవారం ఆయన సందర్శించి అక్కడ నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఆశా కార్యకర్తలకు నిర్దేశించిన ఆరోగ్య కార్యక్రమాలు ఏ మేరకు అమలు చేస్తున్నారు, అందజేస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు. సచివాలయాల వారీగా వైద్య సిబ్బంది చేపడుతున్న ఆరోగ్య సేవల ప్రగతి నివేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జగన్మోహనరావు మాట్లాడుతూ మారుమూల మరియు గిరి శిఖర గ్రామాల్లో అవసరమైన మందులు, ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంచి, వారికి తగు దిశా నిర్దేశనం చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని, అందుకు అవసరమైన శిక్షణ, పరిజ్ఞానంపై ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ర్యాపిడ్‌ టెస్టులు ద్వారా సికిల్‌సెల్‌ ఎనీమియా గుర్తించే పద్ధతులపై ప్రతి ఒక్కరూ శిక్షణ పొంది తెలుసుకోవాలన్నారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్‌ వాహనం సేవలు హైరిస్కు, రక్త హీనత గర్భిణులకు వినియోగించాలన్నారు. అనంతరం ఆయన పిహెచ్సిలో లేబర్‌ రూం తనిఖీ చేసి కాన్పుల రికార్డు పరిశీలించారు. అలాగే వ్యాక్సిన్‌ నిల్వలు వాటి నిర్వహణ తనిఖీ చేశారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడి ఆరోగ్య పరిశీలన చేశారు. అనంతరం డాక్టర్‌ జగన్మోహనరావు స్థానికంగా ఉన్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను వైద్య సిబ్బందితో కలిసి సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ చేశారు. రక్త హీనత గా గుర్తించిన విద్యార్ధులకు ప్రతీ రోజూ ఐరన్‌ మాత్రలు వేయించాలన్నరు. పరిశుభ్రత, రక్త హీనత, సీజనల్‌ వ్యాధులపై విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ ఎం.బుద్దేశ్వరరావు, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ మోహన్‌ రావు, సూపర్‌ వైజర్లు పద్మ, సింహాచలమమ్మ, రేరాయమ్మ, జయ గౌడ్‌, ఎఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పిలు,హెల్త్‌ అసిస్టెంట్లు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.గరుగుబిల్లి : మాతృ మరణాల నివారణే ధ్యేయంగా సిబ్బంది పని చేయాలని ఆర్‌బిఎస్‌కె జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ధవళ భాస్కరరావు అన్నారు. మంగళవారం స్థానిక పిహెచ్‌సిలో ఆశాడే సందర్భంగా ఆశా కార్యకర్తలకు మాతా శిశు ఆరోగ్య, సంక్షేమంపై ప్రభుత్వం కొత్తగా తెచ్చిన యాప్‌ కోసం నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్వైజర్లు, సిబ్బంది పర్యవేక్షణా లోపాల్లేకుండా పనిచేయాలని సూచించారు. మాతృమరణాల నివారణే ధ్యేయం కావాలన్నారు. ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అందించే సేవలపై ఆరా తీశారు. అలాగే ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు తగు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ కెకె సాగర్‌ వర్మ, వైద్య సిబ్బంది చింతాడ ఉదయకుమారి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. వీరఘట్టం : గ్రామాల్లోని గర్భిణులను గుర్తించి వారికి సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు పడేలా చూడాలని స్థానిక వైద్యాధికారి పి.ఉమామహేశ్వరి ఆశా కార్యకర్తలకు ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆశా కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తరచుగా గ్రామాలు సందర్శించి ప్రజల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకోవాలన్నారు. అలాగే అంగన్వాడి కేంద్రాల ద్వారా వారికి పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ప్రసవ సమయంలో గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం ఆశా కార్యకర్తలకు టవళ్లు, అద్దాలు, గాజులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్‌ ఒ.శాంతి కుమారి, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️