శైవక్షేత్రాలకు పోటెత్తిన జనం

Mar 8,2024 21:45

పాచిపెంట: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో గల పలు శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. శుక్రవారం వేకుజాము నుండే భక్తులతో శివాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా మండలంలోని పనుకువలస పంచాయతీ పెద్ద చీపురువలస సమీపాన గల పారమ్మ కొండ వద్ద ఉత్తరాంధ్ర, ఒడిశా, చత్తీస్గడ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు పారమ్మ తల్లిని దర్శించుకున్నారు. డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర దంపతులు పారమ్మ కొండకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆయతో పాటు టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి అమ్మవారిని దర్శించుకున్నారు. పారమ్మ కొండ దిగువున నిర్మించిన పారమ్మ తల్లి దేవాలయానికి భక్తులు తండోపతండాలుగా చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండపై ఏర్పాటు చేసిన అఖండ జ్యోతిని సందర్శకులు తిలకించారు. యాత్రికుల సౌకర్యార్ధం సాలూరు పట్టణానికి చెందిన పలు స్వచ్ఛంద సేవా సంస్థలు భోజనాలు, అల్పాహారం, ఉసిరికాయలు, మజ్జిగ, పులిహోరా ప్యాకెట్లు, మంచినీళ్లు అందజేశారు సాలూరు ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు కొండ వద్దకు ఏర్పాటు చేశారు. సాలూరు సిఐ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై పి.నారాయణరావు, పోలీస్‌ సిబ్బంది పారమ్మకొండ జాతర పరిసరాల్లో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు, వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించారు. పాచిపెంట పిహెచ్‌సి ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు కావాల్సిన మందులు అందజేశారు. అలాగే సాలూరు పట్టణానికి చెందిన పలు స్వచ్ఛంద సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. కురుపాం : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, మన్యం జిల్లా వైసిపి అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజ్‌ మండలంలోని గుమ్మలో వెలిసిన నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, జడ్పిటిసి జి.సుజాత, సర్పంచులు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొమరాడ : మహాశివరాత్రి సందర్భంగా జంఝావతి -నాగవళి నదుల సంగమంలో వెలిసిన గుంప సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తాకిడితో కళకళలాడింది. శుక్రవారం వేకువ జాము నుంచి సోమేశ్వరస్వామిని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా ఆలయ సిబ్బంది సౌకర్యాలు కల్పించినా, కొంత అసౌకర్యంతో ఇబ్బందులు పడ్డారు. ఆలయంలో ప్రవేశానికి భక్తుల నుంచి టిక్కెట్ల రూపంలో డబ్బులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నా సౌకర్యం కల్పించడంలో దేవదాయ శాఖ విఫలమైందన్న విమర్శిలు వెల్లవెత్తాయి. కనీసం పేద భక్తుల కోసం ఉచిత దర్శనం పెట్టకపోవడంతో ఈ ప్రాంత గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు రూపంలో అధికంగా వసూలు చేసినప్పటికీ ఆలయ అభివృద్ధిని కనీసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందరం లేదని ఆలయ కమిటీ సభ్యులు కూడా మండిపడుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అల్లర్లు జరగకుండా కొమరాడ ఎస్సై కే నీలకంఠం ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. గత మూడు రోజులుగా ఆలయ ప్రాంగణంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తుల రాకపోకల కోసం పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి సుమారు పది బస్సులు వరకు నడిపినప్పటికీ ప్రైవేటు వాహనాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పార్వతీపురం రూరల్‌ : మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మండలంలోని పలు శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రఖ్యాతిగాంచిన అడ్డాపుశిలలోని కాశీఅన్నపూర్ణ క్షేత్రంలో శుక్రవారం వేకువ నుంచి భక్తులు తాకిడి ఎక్కువ కావడంతో క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. వచ్చిన వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మందిర చైర్మన్‌ అక్కిన సుందరనాయుడు ఆధ్వర్యంలో తాగునీరు, క్యూలైన్లు ప్రసాదం ఏర్పాటు చేశారు.భక్తుల కొరకు వైద్యశాఖ ఉచిత చికిత్స శిబిరం నిర్వహించారు. శుక్రవారం రాత్రి లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పురోహితులు శ్రీనివాస్‌ పండా తెలిపారు. అలాగే తాళ్లబురిడి, నర్సిపురం, వెంకంపేట, చిన్నబొండపల్లి గ్రామాలలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు దేవాలయాల్లో మహాశివరాత్రి పురస్కరించుకొని మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సీతానగరం : మండలంలోని సీతానగరం గుచ్చిమి, బూర్జ వెంకటాపురం, లచ్చయ్యపేట తదితర గ్రామాల్లో శివరాత్రి పురస్కరించుకొని భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు క్యూలో నిలబడి పూజలు చేసేందుకు వచ్చారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను తీసుకున్నారు. సీతంపేట : మండలంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాల్లో భక్తులు ప్రజలు శివనామ స్మరణతో శివాలయాల్లో మారుమోగింది. సీతంపేటలో కాశీ విశ్వేశ్వర ఆలయం పులిపుట్టిలో ఉన్న భూలింగేశ్వరి ఆలయం రామగిరి క్షేత్రం వద్ద విశ్వేశ్వరుని ఆలయం భక్తులతో పోటెత్తింది. భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

➡️